Sankranthi Kodi Pandalu: “ఎర్ర మట్టితో తయారుచేసిన బిర్రు. చుట్టూ ఇనుప తీగల తో కట్టిన కంచె. చుట్టూరా జనం. రెండు కోళ్లు, వాటి కాళ్లకు కట్టిన కత్తులు… ఒకటి సై అంటే… ఇంకొకటి సై సై అన్నది. మొత్తానికి కదనరంగం దుమ్ము లేచిపోయింది. కత్తులు కుత్తుకలను తెగ కోయడంతో పందెం నెత్తురుడింది..”కాకినాడ నుంచి తుని దాకా ఇదే పరిస్థితి.. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి కోడిపందాలు కాసుల పంట పండించాయి. విజేతలకు విలువైన బహుమతులను అందించాయి.

వాస్తవానికి కోడిపందాల మీద గతంలో నిషేధం ఉండేది.. కానీ ఈసారి అధికార వైఎస్ఆర్సిపి నాయకులు పందాలు నిర్వహించారు.. పోలీసులు కూడా ప్రేక్షక పాత్రకు పరిమితం కావడంతో పందాలు జోరుగా సాగాయి.. కోట్లలో బెట్టింగులు నడిచాయి.. భీమవరం ప్రాంతంలో కోడిపందాల్లో గెలిచిన వారికి రాయల్ ఎన్ఫీల్డ్, 10 గ్రాముల బంగారం, ఇతర కంపెనీల ద్విచక్ర వాహనాలను బహుమతులుగా ఇచ్చారు. వీఐపీ ఎంట్రీ పాస్ కు 40,000 దాకా వసూలు చేశారు. కేవలం కోడిపందాలే కాక ఇతర జూదాలు కూడా నిర్వహించారు. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో కోడిపందాల నిర్వాహకులు కూడా రెచ్చిపోయారు.. రెట్టించిన ఉత్సాహంతో పందాలు నిర్వహించారు.

ఇక గోదావరి జిల్లాలు, కృష్ణ, గుంటూరులో ఈసారి రికార్డ్ స్థాయిలో కోడిపందాలు జరిగాయి.. ఎన్నికలకు ఒక ఏడాది మాత్రమే ఉండడంతో అధికార పార్టీ నాయకులు కోడిపందాలను అన్ని తామై నిర్వహించారు. కొన్నిచోట్ల అయితే తమ పామాయిల్ తోటలు, మామిడి తోటల్లోనే బిర్రులు ఏర్పాటుచేసి కోడిపందాలు నిర్వహించారు.. కోడిపందాలకు ఈసారి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ప్రజాప్రతినిధులు భారీగా హాజరయ్యారు.. పొ రుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా జనం బాగా వచ్చారు. గుండాట, గ్యాంబ్లింగ్, కోడి కత్తి… ఇలాంటి ఆటలు కూడా నిర్వహించారు.. దీంతో నిర్వాహకుల పంట పండింది.. ఈసారి ఫీజు రేటు కూడా పెంచడంతో భారీగా లాభాలు వచ్చాయి.. అధికార పార్టీ నాయకులతో మాకెందుకు గొడవ అనుకునే వాళ్ళు మాత్రం ఆన్లైన్లో కోడిపందాలు నిర్వహించారు.. సో మొత్తానికి ఏపీలో కోడిపందాల వల్ల వందల కోట్లు చేతులు మారాయి.. ఇక గత ఏడాది గుడివాడలో చికోటి ప్రవీణ్ కేసినో నిర్వహించి 350 కోట్ల దాకా వసూలు చేశాడు. ఈసారి గన్నవరంలో నిర్వహించాడు.. మరీ ఇందులో ఎంత నగదు చేతులు మారింది అనేది తెలియాల్సి ఉంది.