Pawan Kalyan: ప్రజారాజ్యం అనుభవాలతో జనసేన పాఠాలు నేర్చుకుంటోంది. గతంలో దొర్లిన తప్పులను పునరావృతం కాకుండా చూసుకుంటోంది. 2024 ఎన్నికలకు జనసేన వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. గతానికి భిన్నంగా జనసేనాని ఎత్తుగడలు వేస్తున్నారు. వ్యూహాలు రచిస్తున్నారు. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రతి అడుగులోను రాజకీయ పరిణితి స్పష్టంగా కనిపిస్తోంది.

2009 ఎన్నికల్లో తెలుగు రాజకీయ యవనిక పై ప్రజారాజ్యం మెరిసింది. తొలిసారిగా ఉమ్మడి ఏపీలో 18 సీట్లు సాధించింది. మూడో ప్రత్యామ్నాయ ఆవశ్యకతను గుర్తు చేసింది. కాలక్రమంలో మెగాస్టార్ చిరంజీవి రాజకీయలకు దూరం జరిగారు. దీంతో జనసేనాని పవన్ కల్యాణ్ ఆ బాధ్యతను నెత్తిన పెట్టుకున్నారు. తెలుగు రాజకీయాల్లో మార్పు రావాలని బలంగా కోరుతున్నారు. జనసేనతో సాధ్యమని నమ్ముతున్నారు.
జనసేన, టీడీపీ పొత్తు ఖాయమని చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. ప్రజారాజ్యం సమయంలో జరిగిన తప్పులను జరగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులో భాగంగా వచ్చే సీట్లలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపనున్నారు. మొదటి నుంచి జనసేనతో కలిసి ప్రయాణం చేస్తున్న నేతలకే అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 9 ఏళ్లుగా జనసేనతో కలిసి పయనిస్తున్న నేతలు చాలా మంది ఉన్నారు. వారిని గుర్తించి గెలిచే అవకాశం ఉన్న ప్రాంతాల్లో వారికి టికెట్లు ఇవ్వాలని జనసేనాని భావిస్తున్నారు.

కీలకమైన కొన్ని నియోజకవర్గాల పై దృష్టి పెట్టడం ద్వార విజయం సులువుగా మారుతుందని జనసేనాని అంచనా వేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఏర్పాటులో, అధికార భాగస్వామ్యంలో కీలక భూమిక పోషించవచ్చని భావిస్తున్నారు. గతానికి భిన్నంగా పూర్తీ రాజకీయ పరిణితితో పవన్ ఆలోచిస్తున్నారు. ఇటీవల రణస్థలం వేదికగా పవన్ వ్యాఖ్యలు ఆయన రాజకీయ పరిణితికి అద్దం పడుతున్నాయి. తన స్పష్టమైన రాజకీయ విధానాన్ని ప్రకటించారు. అటు శత్రువులకు, ఇటు మిత్రులకు తాను చెప్పాల్సిన అంశాల్ని స్పష్టంగా చెప్పారు. ఓటమితో జనసేన ఎన్నో పాఠాలు నేర్చుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత అనుభవాలు జనసేనకు గుణపాఠాలుగా మారి, భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి బాటలు వేస్తాయని అంటున్నారు.