YCP Bus Yatra Failure: ప్రజలకు అన్నీ ఇస్తున్నాం. సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నాం. అయినా ప్రజల నుంచి తగినంత ఆదరణ కనిపించడం లేదు. ఎందుకిలా అంటూ ఇప్పుడు సగటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసి తెగ బాధపడుతున్నారు. అట్టహాసంగా ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం, ఆనక 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రుల ‘సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర’ ఘోరంగా విఫలం కావడంతో వారిలో అంతర్మథనం ప్రారంభమైంది. మూడేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలను ఉగాది నుంచి ప్రతి గడపకూ వెళ్లి వివరించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మార్చిలోనే ఆదేశించారు. అందులో విస్తృతంగా పాల్గొని ప్రజాదరణ చూరగొన్నవారికే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తానని.. లేదంటే ఇవ్వనని కుండబద్దలు కొట్టారు. వారు తొలుత విముఖత చూపడంతో పలు దఫాలు వాయిదావేశారు. చివరకు సీఎం ఒత్తిడితో ఎట్టకేలకు మే 10న ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం మొదలుపెట్టారు. కానీ జనం ఎక్కడికక్కడ నిలదీయడం మొదలుపెట్టారు. పింఛన్ల కోత, అమ్మ ఒడి, చెత్త పన్ను, కరెంటు కోతలు, చార్జీల పెంపు, ఇంటిపన్ను, పెట్రో ధరల బాదుడు, రోడ్ల దుస్థితి వంటి వాటిపై ప్రశ్నిస్తున్నారు.
ఎక్కడికక్కడే నిలదీతలు
మనం అన్నీ ఇస్తున్నాం కదా.. తిరుగుండదని చాలా మంది వైసీపీ ప్రజాప్రతినిధులు గడపగడపకూ వెళ్లారు. ప్రజల నుంచి చీత్కారాలను ఎదుర్కొన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉందని గ్రహించిన చాలా మంది ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. ప్రజల ఛీత్కారాలతో ప్రభుత్వ పెద్దలు సైతం బిత్తరపోయారు. దాంతో జనంలోకి నేరుగా వెళ్లకుండా.. బస్సు యాత్ర, సభలు పెడితే నిలదీసేవారు ఉండరని భావించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు కేబినెట్‌లో పెద్దపీట వేశామని ప్రచారం చేసుకునేందుకు ఆ వర్గాలకు చెందిన 17 మందిని రంగంలోకి దించారు.
Also Read: ED Summons Sonia And Rahul: సోనియా, రాహుల్ లను ‘ఈడీ’తో అడ్డంగా బుక్ చేసిన మోడీ
మే 26న శ్రీకాకుళంతో ప్రారంభించి.. 29న అనంతపురంతో యాత్రను ముగించారు. బహిరంగ సభలు కూడా పెట్టారు. అయితే ఎక్కడా ప్రజల నుంచి స్పందన లేదు. ఒక్క సభకు కూడా పెద్దగా హాజరైంది లేదు. అధికారులపై ఒత్తిడి తెచ్చి డ్వాక్రా సంఘాల సభ్యులను, ఉపాధి కూలీలను బతిమాలి.. బెదిరించి.. డబ్బులిచ్చి బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల్లో తరలించినా.. మండుటెండల్లో గంటలకొద్దీ ఉండలేక వారు తిరుగుముఖం పట్టారు. దీంతో సభలన్నీ వెలవెలబోయాయు. పథకాల లబ్ధిదారులు కూడా రాలేదు. బలహీన వర్గాల నుంచీ నిరాదరణే ఎదురైంది.
మహానాడు సక్సెస్ తో కలవరం..
అటు అదే సమయంలో టీడీపీ మహానాడు సక్సెస్ అయ్యింది. స్వచ్ఛందంగా 3 లక్షల మందికిపైగా హాజరయ్యారన్న వార్తలతో వైసీపీ పెద్దల్లో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. మరోవైపు.. ప్రజల నిలదీతలపై ఆగ్రహంతో ఉన్న కొందరు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిస్తోంది. పథకాల సొమ్మును నేరుగా ఖాతాల్లోకి వేస్తున్నామని.. అన్నీ ప్రభుత్వమే చేయాలంటే ఎలాగని వ్యాఖ్యానించిన మంత్రి ధర్మాన ప్రసాదరావుపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచిత దూషణలు, బస్సుయాత్రకు సంబంధించి వాస్తవ కథనాలు రాసిన మీడియా ప్రతినిధుల వీపులు పగులగొడతానని కర్నూలు మేయరు బీవై రామయ్య చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి బాగా వెళ్లాయి. ఇదిలా ఉంచితే.. అమలాపురంలో విధ్వంసకాండకు ప్రభుత్వమే కారణమని, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్‌ను చంపిన అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఇదంతా చేసిందని విమర్శలు వెల్లువెత్తుండడంతో వైసీపీ నాయకుల్లో అసహనం మరింత పెరుగుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
Also Read:Corruption In Aarogyasri: పేదల వైద్యం పక్కదారి.. ఆరోగ్యశ్రీ అవినీతిమయం
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Samajika nyaya bheri bus yatra a big failure
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com