Sajjanar: దిశ నిందితుల ఎన్ కౌంటర్లో ప్రధాన పాత్ర పోషించిన సజ్జనార్ కు చిక్కులు చుట్టు ముడుతున్నాయి. అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్లో సజ్జనార్ పై ప్రశంసలే దక్కాయి. అది నిజమైన ఎన్ కౌంటరా? కాదా అనే విషయం పక్కనపెడితే సజ్జనార్ మాత్రం అప్పుడు పోలీస్ హీరో అని ఆయనపై అందరు ప్రశంసలు కురిపించారు. ఆ ఎన్ కౌంటర్ కు ప్రజామోదం లభించింది. కానీ తదనంతర పరిణామాల్లో సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ విచారణలో మాత్రం ఆయనకు చుక్కెదురవుతోంది. అందరిని ప్రశ్నించిన కమిషన్ రెండు రోజుల్లో సజ్జనార్ ను కూడా ప్రశ్నించే అవకాశం ఏర్పడింది.

ఎన్ కౌంటర్ పై విచారణకు ప్రత్యేక బృందం చీఫ్ గా మహేశ్ భగవత్ ను నియమించింది. ఆయన ఇప్పటికే పలుమార్లు కమిషన్ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆయన చెబుతున్న పొంతన లేని విషయాలతో సజ్జనార్ కు చిక్కులు వచ్చే అవకాశం ఏర్పడుతోంది. కమిషన్ అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పాల్సిన ఆయన ఇలా తడబడటం చూస్తుంటే సజ్జనార్ కు ఇబ్బందులు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఎన్ కౌంటర్ విషయంలో కమిషన్ లేవనెత్తుతున్న అనుమానాలు నివృత్తి చేయడంలో తడబడటంతోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సిర్పూర్కర్ కమిషన్ ఎన్ కౌంటర్ బూటకమని నివేదిక ఇస్తే సజ్జనార్ కెరీర్ కే ప్రమాదం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో కమిషన్ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది.
సజ్జనార్ ను ప్రశ్నించాలని సర్పూర్కర్ కమిషన్ నిర్ణయించి సమన్లు జారీ చేసింది. మంగళ, బుధ వారాల్లో ఆయనను ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, ఈ నేపథ్యంలో దిశ ఎన్ కౌంటర్ పై జరిగే విచారణలో సజ్జనార్ మెడకు ఉచ్చు బిగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఆడపిల్లను చంపిన హంతకులకు అప్పడు వచ్చిన ఒత్తిడి మేరకు వారిని ఎన్ కౌంటర్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.