అదేంటి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రైవేటు టీచర్ల కష్టాలు తీర్చడం ఏంటని అనుకుంటున్నారా..! అవును మరి అదే నిజం. ప్రైవేటు టీచర్లకు నెలకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఇస్తున్నారంటే ఆ క్రెడిట్ అంతా కూడా నాగార్జున సాగర్ బైపోల్‌దే. ఎందుకంటే.. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రైవేటు టీచర్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వెంటనే రెండు రోజులకు అతని భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. అదే సమయంలో.. ప్రైవేటు టీచర్లు పెద్ద ఎత్తున సెల్ఫీ వీడియోల ద్వారా తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అలా సిరిసిల్లకు చెందిన ఓ ఉపాధ్యాయుడు పెట్టిన పోస్ట్ కాస్త వైరల్ అయింది. దీంతో ప్రైవేటు టీచర్ల కష్టాలు సీఎం కేసీఆర్ వరకూ వెళ్లాయి. వెంటనే వారిని ఆదుకునేందుకు ఏర్పాట్లు చేసేశారు.
కరోనా కారణంగా రాష్ట్రంలో స్కూళ్లు మూసివేశారు. అయితే.. గతేడాది నుంచే ఈ పరిస్థితి ఉంది. మధ్యలో కొన్ని రోజులు మాత్రమే స్కూల్స్ తెరుచుకున్నాయి. ఇక తమ ఉపాధికి వచ్చిన ఢోకా ఏమీ ఉండదంటూ అనుకున్నారు టీచర్లు. కానీ.. కరోనా మరోసారి విజృంభిస్తుండడంతో వాటిని తప్పనిసరి పరిస్థితిలో మూసివేయాల్సి వచ్చింది. అప్పటికే ఏడాది పాటు ఉపాధి లేకుండా ఖాళీగా ఉండిపోయిన ప్రైవేటు టీచర్లు.. దీంతో మరింత గందరగోళంలోకి నెట్టివేయబడ్డారు.
ఇక ఎప్పుడైతే రాష్ట్రంలో విద్యాసంస్థలు క్లోజ్ అయ్యాయో అప్పటి నుంచే ప్రైవేటు టీచర్లు ఆందోళనబాట పట్టారు. పబ్బులు, సినిమా హాళ్లలో లేని కరోనా విద్యాసంస్థలకే వస్తోందా అంటూ నినదించారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలన్న డిమాండ్ వచ్చింది. దీనికితోడు ఆత్మహత్యలు కూడా జరుగుతుండడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నాగార్జునసాగర్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన గంటలోనే ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు ఊరట కలిగిస్తూ ప్రకటన చేసింది. రూ.రెండు వేల సాయం, నెలకు 25 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు.
అయితే.. ఈ మొత్తం ఒక్క సారే ఇస్తారని అనుకున్నారు అందరూ. కానీ మళ్లీ స్కూళ్లు తెరిచే వరకూ ప్రైవేటు టీచర్లందరికీ.. ఈ సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రైవేటు టీచర్లు కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. ఉపఎన్నికల పుణ్యమా అని ప్రభుత్వం ప్రైవేటు టీచర్లను పట్టించుకుంటోందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఎక్కువ మంది స్కూళ్లు తెరవాలనే డిమాండ్‌నే వినిపిస్తున్నారు. కానీ.. ప్రభుత్వం మాత్రం అందుకు సుముఖంగా లేదు.