
టీడీపీని కాలదన్ని బీజేపీలో చేరిన యువ మహిళా నేత సాధినేని యామినికి ఎట్టకేలకు ఒక అత్యున్నత పదవి లభించడం విశేషమే మరీ.. ఏకంగా ప్రధాన మంత్రి మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న కాశీలో ఏరికోరి ఆమెకు పదవి దక్కడం రాజకీయ వర్గాలను చాలా ఆశ్చర్యపరిచింది.
ప్రధాని మోడీ నియోజకవర్గం కావడంతో ఆమె కాశీని ఎన్నుకున్నారని.. కాశీలో పనిచేస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ మోడీ నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా ఆయనకు తెలుస్తుంది. కాబట్టి సాధినేని యామిని నియామకం కూడా మోడీ కనుసన్నల్లోనే జరిగినట్టు తెలుస్తోంది. బీజేపీలో కొరతగా ఉన్న మహిళా నేతల కోటాను సాధినేనితో భవిష్యత్తులో భర్తీ చేసే యోచనలోనే ఇలా అత్యున్నత పదవిని ఇచ్చినట్టు బీజేపీలో ప్రచారం సాగుతోంది.
భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం యామిని శర్మ సేవలను ఎట్టకేలకు గుర్తించింది. ఆమె ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డులో సభ్యురాలిగా మారడం విశేషం. ఈ మేరకు టెంపుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యామినికి పదవిని ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నంత కాలం సాధినేని యామిని తన తొలి కులాన్ని ఎప్పుడూ చెప్పలేదు. బ్రాహ్మణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ ఆమె ఎప్పుడూ శర్మ అనే పదాన్ని తన పేరు చివర వాడలేదు. కమ్మ సమాజానికి చెందిన తన భర్త ఇంటిపేరునే ఆమె ఉపయోగించుకుంది.
టీడీపీ నుంచి బయటకొచ్చి బీజేపీలో చేరాక.. అకస్మాత్తుగా హిందూత్వ బీజేపీలో బ్రాహ్మణ ఇంటి పేరును తిరిగి చేర్చుకొని సాధినేని యామినీ శర్మగా మారింది. కాబట్టి ఇప్పుడు ఆమె బ్రాహ్మణ మూలాలను తిరిగి కనుగొంది. కాబట్టే కాశీలోని విశ్వనాథ ఆలయానికి ఆమెను ‘బ్రాండ్ అంబాసిడర్ గా’ నియమించారని తెలుస్తోంది.
దక్షిణ భారతదేశంలో కాశీ ఆలయానికి కొత్త అధికారిక ప్రతినిధిగా యామిని వ్యవహరించనున్నారు. ఆలయం ఉన్న పట్టణంలో అందుబాటులో ఉన్న భక్తుల కోసం కార్యక్రమాలు – సౌకర్యాలను విస్తరించడానికి.. సేవా ప్రచారం చేయడానికి యామినికి అధికారాలుంటాయి.
ఇప్పుడు, బిజెపి నాయకత్వం ఆమెకు కీలకమైన కాశీ ఆలయ పదవితో సత్కరించింది. ఆమె ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఆలయ సమాచార ప్రచారానికి బాధ్యత వహిస్తుంది.
సోషల్ మీడియాలో ఆలయ సీఈఓకు కృతజ్ఞతలు తెలిపిన యామిని, ఆలయం చేపట్టిన హిందూ ధర్మ రక్షణ కార్యక్రమాలను పని చేయడానికి – వ్యాప్తి చేయడానికి ఈ అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి కాశీ ఆలయంలో పదవి లభించడంతో యామినికి జాతీయ స్థాయిలో నేతగా ఎదిగే అవకాశం లభించిందని అంటున్నారు.