Russia- Ukraine War: మంచి యుద్ధం, చెడ్డ శాంతి ఉండవని బెంజిమెన్ ఫ్రాంక్లిన్ ఎప్పుడో చెప్పారు. అది ఇప్పుడు రష్యాకు తెలిసి వస్తున్నది. నాటో దేశాలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. మొదట్లో ఉక్రెయిన్ దేశాన్ని నేలమట్టం చేశామని విర్రవీగిన పుతిన్ కు ఇప్పుడు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా రష్యా ప్రధాన భూభాగంతో క్రిమియా ద్వీ పకల్పాన్ని కలిపే వంతెనపై శనివారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కొంత భాగం దెబ్బతిన్నది. దక్షిణ ఉక్రెయిన్ల రష్యా బలగాలకు అవసరమైన యుద్ధ సామగ్రి రవాణాకు ఈ వంతెనే కీలకం. అయితే ఈ వంతెనను పలుమార్లు పేల్చేచేస్తామని హెచ్చరికలు జారీ చేసిన ఉక్రెయిన్.. ఈ ఘటనపై అధికారికంగా ఇంకా స్పందించలేదు. కానీ అక్కడి అధికారులు ఈ ఘటనపై మాత్రం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై ఉక్రెయిన్ హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పేలుడు ఘటనపై ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల చేస్తామని ఉక్రెయిన్ ప్రకటించడం గమనార్హం. గత మే నెలలో రష్యా యుద్ధ నౌక మునిగిపోయినప్పుడు ఉక్రెయిన్ పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. ఈ ఘటనపై ఇప్పటివరకు రష్యా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఉక్రెయిన్ లో స్వాధీనం చేసుకున్న లేమన్ వంటి ప్రాంతాలను కోల్పోయిన రష్యాకు ఇది షాక్ ఇచ్చే పరిణామం.

2014లోనే ఆక్రమించింది
క్రిమియా ను 2014లో రష్యా ఆక్రమించింది. రష్యా కెర్చ్ జలసంధి మీదుగా యూరప్ లోనే అత్యంత పొడవైన, 12 మైళ్ళ వంతెనను 2018లో నిర్మించింది. రైళ్ళు, ఇతర వాహనాల రాకపోకలకు వీలుగా ఈ వంతెన పై రెండు వేరువేరు సెక్షన్లు ఉన్నాయి. ఈ వంతెన మీదుగానే సైనికులకు సరుకుల రవాణా, ఇతరత్రా సామగ్రి పంపిణీ చేపడుతోంది. ఈ వంతెన పేలడం ద్వారా సైనికులకు మందు గుండు సామగ్రి అందే అవకాశం ఉండదు. ఈ వంతెన పై పేలుడు సంభవించిన కొద్ది గంటలోనే రష్యా పరోక్షంగా స్పందించింది. ఉక్రెయిన్ లో తమ సేనలకు ఎయిర్ ఫోర్స్ చీఫ్ జనరల్ సుర్గీ సురో వికిన్ నేతృత్వం వహిస్తారని అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు దక్షిణ ఉక్రెయిన్ లో ఆయన రష్యా సేనలకు నాయకత్వం వహిస్తున్నారు. పేలుడు నేపథ్యంలో ఉక్రెయిన్ పై కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేపట్టాలని రష్యా ప్రతినిధులు అధ్యక్షుడు పుతిన్ ను కోరారు. పుతిన్ ఇందుకు సానుకూలంగా స్పందించిన పక్షంలో అక్కడి సైనికులకు విస్తృతమైన అధికారాలు దఖలు పడతాయి.
ఖర్కివ్ పై దాడుల పరంపర
ఉక్రెయిన్ లోని రెండవ అతిపెద్ద నగరం ఖర్కివ్ పై రష్యా క్షిపణులతో దాడులు చేస్తోంది. ఖర్కివ్ సమీపంలోని మూడు పట్టణంలోని నివాస ప్రాంతాల్లో ఈ క్షిపణులు పడటంతో ఒకరు చనిపోయారు. ఈ దాడుల్లో రష్యా ఎస్ 300 క్షిపణులను ప్రయోగించినట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు సామాగ్రి నిండుకోవడం వల్లే ప్రధానంగా గగనతలం నుంచి భూమిపై లక్ష్యాలను ఛేదించేందుకు వాడే ఈ క్షిపణులను ప్రయోగించినట్టు రష్యా అధికారులు వెల్లడించారు.

సుమీ ప్రాంతం పైనా
ఉక్రెయిన్ దాడులు తీవ్రతరం చేయడంతో ఖెర్సన్ ప్రాంతంలోని పౌరులను ఇతర ప్రాంతాలకు రష్యా తరలిస్తోంది. ఉక్రెయిన్ బలగాల తీవ్ర ప్రతిఘటనతో రష్యా బెంబేలెత్తుతోంది. ఖెర్సన్ నుంచి పౌరులను రష్యాలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు తదితరులకు దక్షిణ రష్యాలో ఏర్పాట్లు చేస్తున్నామని వివరిస్తున్నారు. ఉక్రెయిన్ బలగాలతో హోరాహోరి పోరు తప్పదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని రష్యా అధికారులు పేర్కొంటున్నారు. మొదట్లో ఉక్రెయిన్ పై చేయి సాధించిన రష్యా.. తర్వాత ఆ దేశం బలగాల తాకిడికి తట్టుకోలేక వెనుకంజ వేస్తోంది. వాస్తవానికి మొదట్లో ఉక్రెయిన్ కు మద్దతుగా మాట్లాడిన నాటో దేశాలు తర్వాత ప్లేటు ఫిరాయించాయి. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా ఉక్రెయిన్ విజయమో, వీర స్వర్గమో అన్నట్టుగా పోరాడుతోంది. కాగా ఉక్రెయిన్ తో యుద్ధం ఎంత చికాకు కలిగిస్తుందో ఇప్పుడు రష్యాకు తెలిసి వస్తోంది. ఇప్పటికే యుద్ధం వల్ల దేశ ఆర్థిక రంగం అధోగతిలో ఉన్న నేపథ్యంలో పుతిన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.