Russia Ukraine War: ఫిబ్రవరి 24.. ఆరోజు మొదలు ఇవాల్టి వరకు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం చేస్తూనే ఉంది.. ఆస్తులను నేలమట్టం చేస్తోంది. కీలక నగరాలను ఆక్రమించుకుంటూ పోతున్నది.. విజయమో… వీర స్వర్గమో అన్నట్టుగా పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ ఇంతవరకు రష్యాకు లొంగలేదు. దీంతో రష్యా మరింత రెచ్చిపోతున్నది. దాడులను మరింత ఉధృతం చేస్తోంది. కీవ్, మరియా పోల్ ఇలా కీలక నగరాల మొత్తం తన ఆధీనంలో ఉంచుకుంది.. అయినప్పటికీ ఉక్రెయిన్ బెదరడం లేదు. తాజాగా ఈరోజు కూడా క్షిపణి దాడులు చేసింది. దీనివల్ల ఉక్రెయిన్ లోని కీలక భవనాలు నేలమట్టమయ్యాయి.

–చమురు సెగతో
సాధారణంగా రష్యా దేశం క్రూడ్ ఆయిల్ ను నాటో దేశాలకు ఎగుమతి చేస్తుంది.. అయితే ఉక్రెయిన్ తో రష్యా చేస్తున్న యుద్ధం వల్ల కడుపు మండిన నాటు దేశాలు కొత్త ఆంక్షలకు తెరదిశాయి. తాము చెప్పిన ధరకే క్రూడ్ ఆయిల్ అమ్మాలని నిర్ణయించాయి.. ఆ ధర కూడా 60 డాలర్ల లోపే ఉండాలని తీర్మానించాయి.. దీంతో పుతిన్ ప్రభుత్వానికి ఎక్కడో కాలింది. తాను ఆ ధరకు అమ్మ లేనని తేల్చి చెప్పేసింది. అయితే ఇదే సమయంలో భారత ప్రభుత్వం పాత ధరకే క్రూడ్ ఆయిల్ కొంటానని రష్యా దేశానికి ఆఫర్ ఇచ్చింది. దీంతో నాటో దేశాల నోట్లో పచ్చి వెలక్కాయపడింది.. ఇదే తరుణంలో తనకు మిత్ర దేశమైన భారత్ కు రష్యా రాయితీ మీద చమురు రవాణా చేసే నౌకలు అందజేయనుంది. దీంతోపాటు రూపాయి మారకంలోనే క్రూడ్ ఆయిల్ కు సంబంధించి నగదు స్వీకరిస్తున్నది.

–పంతానికి పోయిన పుతిన్
అయితే ఇటీవల రష్యా దేశంలో ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ రహస్య బంకర్ లోకి వెళ్లిపోయారు. దీంతో యుద్ధం నుంచి రష్యా విరమించినట్టు అందరూ అనుకున్నారు. కానీ వారి అంచనాలను తుత్తు నీయలు చేస్తూ రష్యా మరోసారి ఉక్రెయిన్ పై విరుచుకుపడింది.. ఇందుకు కారణం లేకపోలేదు.. యుద్ధం చేస్తున్న రష్యాను ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకు నాటో దేశాలు క్రూడ్ ఆయిల్ ధరల స్థిరీకరణ చేయాలని మంకు పట్టుపట్టాయి. ఇది నచ్చని పుతిన్ మరింత రెచ్చిపోవాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశాడు. దానివల్లే ఈరోజు ఉదయం ఉక్రెయిన్ పై రష్యా బలగాలు భీకర దాడులు చేశాయి. కడపటి వార్తలు అందే సమయానికి కోట్లలోనే ఉక్రెయిన్ నష్టపోయిందని తెలుస్తోంది.. అయితే ప్రాణం ఎంత జరిగిందనేది తెలియ రాలేదు.. పది నెలలుగా సాగుతున్న యుద్ధం ఒక కొలిక్కి రాకపోవడం ప్రపంచాన్ని నివ్వెర పరుస్తోంది.. దీని నివారణకు ఎవరు కూడా నడుం బిగించకపోవడంతో ఉక్రెయిన్ రావణకాష్టంలా మండుతోంది