Homeఆంధ్రప్రదేశ్‌TTD: టీటీడీని దోచుకుంటున్న అధికార పార్టీ నేతలు?

TTD: టీటీడీని దోచుకుంటున్న అధికార పార్టీ నేతలు?

TTD
TTD

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం.. కళియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న స్థలం. కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం. కానీ టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకోవడం గ్రహపాటుగా మారుతోంది. రాజకీయ కొలువులకు వేదికగా టీటీడీని మార్చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అన్యమతానికి మద్దతుదారుడైన పుట్టా సుధాకర్ యాదవ్ ను టీటీడీ చైర్మన్ చేయగా.. ఇప్పుడు వైసీపీ సర్కారు సైతం అదే పరంపరను కొనసాగిస్తోంది. ఏకంగా అన్యమతస్థుడైన వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ పీఠంపై కూర్చోబెట్టి జగన్ రాజకీయాలు నడుపుతుండడం రోత పుట్టిస్తోంది. ఆలయానికి సంబంధించిన సంపదపై పట్టుపెంచుకునేందుకేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదో రకమైన వ్యాపారం..
వేంకటేశ్వరస్వామి దర్శనం ద్వారా లక్షలు ఆర్జిస్తున్న ప్రజాప్రతినిధులు ఉన్నారు. కళియుగ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని పునీతులమవుతామని భావించే భక్తులను నిలువునా దోచుకుంటున్నారు.తిరుమల శ్రీవారి టిక్కెట్ల కేంద్రంగా ప్రజాప్రతినిధులు ఎన్ని లక్షలు సంపాదిస్తారో కొండ మీద పాతుకుపోయిన ప్రతి ఒక్కరికీ తెలుసు. తమ సిఫార్సు లేఖలతో ప్రోటోకాల్ దర్శన టిక్కెట్లు తీసుకుని అమ్ముకుంటూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల్లో ఎక్కువ మంది చేసే పని అదే. ఇందుకుగాను పీఏలను, ఇతర బ్రోకర్లను ఏర్పాటుచేసుకుంటారు. ఇక ఎమ్మెల్యేల గురించి చెప్పనక్కర్లేదు. మంత్రుల గురించి అయితే మరి ఆలోచించనక్కర్లేదు. వెళుతూ వెళుతూ తమ వెంట పదుల సంఖ్యలో అనుచరులతో గుడికి వెళతారు. లేకుంటే అంతే స్థాయిలో సిఫారసు లేఖలు ఇస్తారు.

షాబ్జీ సరే.. మిగతా వారో?
అయితే విచిత్రంగా టీటీడీ టిక్కెట్ల కుంభకోణంలో గోదావరి జిల్లాలకు చెందిన టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ పట్టుబడ్డారు. అయితే ఆయనది తప్పే కానీ అంతకు మించి వ్యవహారాలు నడిపిన అధికార పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలేవీ? అని సామన్యులు ప్రశ్నిస్తున్నారు.షేక్ షాబ్జీ తిరుమలకు వెళ్లారు. మరో పది మందిని తీసుకెళ్లారు. వారందరితో ప్రోటోకాల్ దర్శనం చేయించారు. ఎందుకో కానీ షాబ్జీ మీద టీటీడీ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ..దర్శనానికి వచ్చిన వారి గుర్తింపు కార్డులు పరిశీలించారు. తప్పుడు ఆధార్ కార్డులు ఉన్నాయని చెప్పి.. అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వచ్చిన వారంతా ప్రోటోకాల్ దర్శన టిక్కెట్లు ఒక్కోటి పది వేల చొప్పున కొన్నారని.. షాబ్జీ అమ్మారని గుర్తించారు. షాబ్జీ డ్రైవర్ ఖాతాలోకి లక్షకుపైగా నగదు జమ చేసినట్లుగా తెలుసుకుని కేసు నమోదు చేసి.. పోలీసులకు అప్పగించారు.

వారిని ట్రాప్ చేసేదెప్పుడు?
టీటీడీ బ్లాక్ టిక్కెట్ల విక్రయాల్లో చాలామందిపై ఆరోపణలున్నాయి. ఇప్పుడు ప్రత్యర్థిగా ఉన్న టీచర్స్ ఎమ్మెల్సీ షాబ్జీ చుట్టూ ఉచ్చుబిగుస్తుండడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. మరో పదిహేడు మంది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇలా టిక్కెట్లు అమ్ముతున్నట్లుగా తెలిసిందని వారిని కూడా ట్రాప్ చేస్తామని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. కానీ వారంతా వైసీపీ వాళ్లు కావడంతో అదంత ఈజీ అయ్యేపనికాదు కూడా. వాస్తవానికి ఎమ్మెల్సీ షాబ్జీ తరచూ తిరుమలకు వెళ్తున్నారు. తనతో పాటు పది నుంచి ఇరవై మంది వరకూ తీసుకెళ్తున్నారు. వారందరిదగ్గర డబ్బులు వసూలుచేస్తున్నారో లేదో స్పష్టత లేదు కానీ.. ఆయన మాత్రం బ్లాక్ టిక్కెట్ల వ్యాపారం చేస్తున్నారన్న అనుమానాలు మాత్రం చాలా మందిలో ఉన్నాయి.

TTD
TTD

మొత్తం వ్యవహారం తేల్చితేనే..
అయితే గత కొంతకాలంగా నడుస్తున్న ఈ అక్రమ దందాను బయటపెట్టిన విజిలెన్స్ అధికారులు అభినందనలు అందుకుంటున్నారు. కానీ అధికార వైసీపీ విషయంలో కూడా ఇదే దూకుడు కొనసాగిస్తే అభినందనలు రెట్టింపయ్యే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం ఇదో రాజకీయ కుట్ర అని తేలిపోతుంది. వాస్తవానికి కొండపై ఓ దళారుల గుంపు ఉంటుది. వారి దగ్గర ఒప్పందం చేసుకున్న వీఐపీల సిఫారసు లేఖలు రెడీగా ఉంటాయి. ఆ లేఖలు పెట్టి టిక్కెట్లు తీసుకుంటారు.. బ్లాక్ లో అమ్మేస్తారు. ఈ విషయంలో నీకింతా.. నాకింతా అని ఒప్పందం చేసుకుంటారు. గుడినే కాదు.. గుడిలో లింగాన్ని సైతం అమ్మేయ్యడానికి సిద్ధంగా ఉండేవారికి పేపరు రూపంలో టిక్కెట్లు ఒక లెక్క. కానీ ఇక్కడ షాబ్జీ విషయంలో మాత్రమే చొరవచూపి.. మిగతా వారి విషయం చెప్పకపోవడం లెక్క తప్పుతోంది. కానీ టీటీడీ టిక్కెట్ల ముసుగులో అధికార పార్టీ వారు బాగానే పోగేసుకుంటున్నారన్న విషయం మాత్రం వెల్లడైంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version