CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి స్థానంలో మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. అయితే వాటిని అమల్లోకి తీసుకురావడంలో మాత్రం విఫలమవుతోంది. ఓవైపు సుప్రీం కోర్టుకు చేరిన అమరావతి రాజధాని పిటిషన్ల విచారణ ఆలస్యమవుతుండడం, మరోవైపు హైకోర్టు తీర్పుతో పాదయాత్ర పునఃప్రారంభించేందుకు రైతులు సిద్ధమవుతుండటం, రుషికొండపై కేంద్ర సర్వేకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు.. ఇలా ఎటు చూసినా సమస్యలే. దీంతో వైజాగ్‌కు తరలి వెళ్లేందుకు ఉన్న ప్రత్యామ్నాయ వ్యూహాలపై జగన్ మంత్రులతో చర్చించబోతున్నారు.

ఎలా తరలిద్దాం?
ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని, ఈ మేరకు సీఆర్డీయే చట్టాన్ని అమలుచేయాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి శరాఘాతంగా మారిపోయింది. దీనిపై ఈ ఏడాది మార్చిలో హైకోర్టు తీర్పు ఇచ్చినా వెంటనే సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధపడలేదు. అందుకు అనేక కారణాలున్నాయి. చివరికి ఆగస్టులో సీజేఐ ఎన్వీ.రమణ రిటైర్మెంట్ తర్వాత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టులో అమరావతి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. అయితే దీనిపై ఎటూ తేలకపోవడం, ఆలోపు ఎదురవుతున్న కొత్త సవాళ్లతో వైజాగ్‌కు రాజధాని తరలింపు వ్యవహారం ప్రశ్నార్ధకంగా మారుతోంది.
ఎన్నికల్లోపు వైళల్లాలని..
మరో 17 నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకో ఆరు నెలలు పోతే.. ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టడం ఖాయం. అప్పుడు రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయం. ఈ నేపథ్యంలో వైజాగ్‌కు రాజధాని తరలింపులో జరుగుతున్న జాప్యం వైసీపీ ప్రభుత్వం మెడకు చుట్టుకోవడం ఖాయం. అమలు చేయలేని మూడు రాజధానులు ఎందుకన్న ప్రశ్న వైసీపీ సర్కార్‌కు ఎదురవుతుంది. దీంతో ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా వైజాగ్‌కు రాజధాని మార్చేయాలన్న పట్టుదలతో వైసీపీ ఉంది. అయినా కోర్టుల్లో వివాదాలు పరిష్కారం కాకుండా ముందుకెళ్లే పరిస్ధితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లోపు వైజాగ్ తరలింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్‌లో కలవరం..
అమరావతి నుంచి వైజాగ్‌కు రాజధాని తరలింపు విషయంలో ఎదురవుతున్న సమస్యలపై త్వరలో సీఎం జగన్ మంత్రులతో భేటీ అయి చర్చించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై విచారణ ఆలస్యం అవుతుండటం, ప్రస్తుత పరిస్ధితుల్లో ఈ నెలలో విచారణ ప్రారంభమైనా తుది తీర్పు ఎప్పుడు వెలువడుతుందో తెలియకపోవడం, వైజాగ్ లో సీఎం క్యాంపు కార్యాలయం పెట్టేందుకు తొలిచేసిన రుషికొండపై హైకోర్టు ఆదేశాలతో కేంద్ర బృందం సర్వేకు సిద్ధమవుతుండటం, అమరావతి రైతుల పాదయాత్ర పునఃప్రారంభమైతే ఎదురయ్యే ఒత్తిడి వంటి అంశాలు జగన్‌ను కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే వీటిపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా జగన్ అడుగు వేయొచ్చని సమాచారం.
త్వరలో కేబినెట్ భేటీ?
సుప్రీంకోర్టు తీర్పుతోపాటు రుషికొండపై హైకోర్టు ఆదేశాలు, అమరావతి పాదయాత్ర వంటి అంశాలపై చర్చించేందుకు జగన్ త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్ల విచారణ ఈనెల 14న పునఃప్రారంభం కాబోతోంది. ఇది మొదలయ్యాక కేబినెట్ భేటీ ఉంటుందని సమాచారం. వైజాగ్‌కు సీఎం క్యాంపు కార్యాలయం తరలింపు లేదా తాను మాత్రమే వెళ్లి అక్కడి నుంచి పాలన మొదలుపెట్టే అంశంపై ఈ సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వేగంగా మారుతున్న పరిణామాల ఆధారంగా ఇందులో మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చని సమాచారం. దీంతో త్వరలో జరిగే కేబినెట్ భేటీ కీలకంగా మారనుంది.