
RS Praveen Kumar : బీఎస్పీ నేతగా మారిన మాజీ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.. బహుజనులను ఏకం చేసేందుకు వేగంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పలు చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి సభలోనూ కేసీఆర్ ను తూర్పారబడుతున్నారు. తాజాగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన సభలో ప్రవీణ్ కుమార్ మాట్లాడారు. బహుజనులను ఇంకా బానిసలుగా ఉంచేందుకు చేసే ప్రయత్నాలు ఇక సాగవని అన్నారు.
సంపద మొత్తం సొంతం చేసుకొని.. దళిత, బహుజన వర్గాలకు కొసరు విసిరేస్తున్నారని ధ్వజమెత్తారు. పట్టు చీరలు మీకు.. బతుకమ్మ చీరలు మాకా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు మీకు.. గొర్రెలు.. బర్రెలు మాకా? అని నిలదీశారు. నిజాంను గడగడలాడించిన సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా బహుజనులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దొరల గడీల మీద యుద్ధం మొదలు పెట్టి.. గోల్కొండ దాకా సాగిన సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని యువతకు పిలుపునిచ్చారు.
తరతరాలుగా కొనసాగుతున్న దోపిడీకి బహుజన రాజ్యం ద్వారానే అడ్డుకట్ట పడుతదని ప్రవీణ్ కుమార్ అన్నారు. దళిత, బహుజనులను ఓట్లు వేసే బానిసలుగా మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. ‘దళిత బంధు’ పథకం అమలులో భాగంగా.. వాసాల మర్రిలో 5 వేల మందికి కేసీఆర్ దావత్ ఇచ్చారని, దానికోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. ఇలాంటి దావత్ లు ఇచ్చి, అధికారం దక్కించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
‘‘మీ బతుకమ్మ చీరలు లేకపోయినా బతికినం. క్రిస్మస్, రంజాన్ దుస్తులు ఇవ్వకపోయినా బతికినం. గొర్రెలు.. బర్రెలు ఇవ్వకపోయినా బతికినం.. కానీ మాకు కావాల్సింది చదువు. అది ఇవ్వకుండా.. మిగిలినవన్నీ ఇచ్చి, బానిసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్రంలోని బీజేపీపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలోని బీసీల పరిస్థితిపై 90 ఏళ్ల క్రితం సర్వే చేశారని, ఇప్పుడు మరోసారి వారి జీవన, ఆర్థిక పరిస్థితిపై సర్వే చేయాలని కోరుతున్నప్పటికీ.. ఆ వినతిని చెత్తబుట్టలో పారేసిందని ఆరోపించారు. దీనిపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదని అన్నారు.
తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో ఒకే ఒక్క సారి అంబేడ్కర్ విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేశారని ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణలో బహుజన సమాజ్ వాజ్ పార్టీ ప్రభంజనం ఎప్పుడైతే మొదలైందో.. అప్పటి నుంచే కేసీఆర్ ‘జై భీమ్’ అనడం మొదలు పెట్టారని విమర్శించారు. నీలి కండువాలు కూడా అప్పటి నుంచే వేసుకోవడం మొదలు పెట్టారని, ప్రగతి భవన్ లోకి అంబేద్కర్ బొమ్మ కూడా అప్పుడే వచ్చిందని అన్నారు. ‘‘కేసీఆర్ ఆడుతున్న డ్రామాలు మాకు అర్థం కావని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇలాంటి మాయలో దళిత బహుజన బిడ్డలు పడబోరని అన్నారు ప్రవీణ్ కుమార్. హుజూరాబాద్ లో దళిత బంధు పేరుతో కేసీఆర్ చేసేది పెద్ద డ్రామా అని అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ చూపిన బాటలో ముందుకు సాగుతామని, రాజ్యాధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.