Farmers Crop : దేశంలో వరి ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌తోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వరి సాగు చేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించి బియ్యంగా మారి సేకరిస్తోంది. వీటిని గోదాముల్లో నిల్వ చేస్తోంది. వరితోపాటు పప్పు ధాన్యాలు, ఇతర ఆహార పంటలతోపాటు వాణిజ్యం పంటలను కూడా కొనుగోలు చేసి నిల్వ చేస్తూ దేశ ప్రజల అవసరాలకు అందిస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. దేశంలో ఏటా వరిసాగు విస్తీర్ణం, దిగుబడి పెరుగుతోంది. దీంతో కేంద్రం కొనుగోలు చేస్తున్న ధాన్యం నిల్వలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిల్వలను కేంద్రం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇటీవలే ఉపాధి కూలీలకు కూడా డబ్బులకు బదులు బియ్యం ఇవ్వాలన్న ఆలోచన చేసింది. నిల్వలు తగ్గించుకునే ఆలోచనలో భాగంగా అనేక ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది.
తగ్గుతున్న ఇతర పంటల సాగు..
ఇదిలా ఉంటే.. వివిధ కారణాలతో దేశంలో వరి సాగు విస్తీర్ణం, వాణిజ్య పంటల సాగు పెరుగుతోంది. ఇదే సమయంలో తృణధాన్యాలు, పప్పు ధినుసులు, నూనెగింజల సాగు విస్తీర్ణం తగ్గుతోంది. దీంతో దేశ అవసరాలకు సరిపడా పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు పండకపోవడంతో వాటి ధరలు ఏటా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పప్పు ధాన్యాలు, జొన్న, మొక్కజొన్న, చిరు ధాన్యాలు అయిన రాగులు, సజ్జలు, కొర్రలు తదితర పంటల సాగు తక్కువగా ఉంది. దీంతో వీటి ధరలు సామాన్యులకు అందకుండా పెరుగుతున్నాయి.
ప్రత్యామ్నాయ పంటలపై కేంద్రం దృష్టి..
వరి మినహా ఇతర ఆహార పంటల సాగు విస్తీర‍్ణం తగ్గిపోవడంతో కేంద్రం వాటి పెంపుపై దృష్టిసారించింది. ఏటా పప్పు ధాన్యాలు, నూనెగింజలు, జొన్న, మొక్కజొన్న పంటల మద్దతు ధరలను పెంచుతోంది. అయినా.. చాలా రాష్ట్రాల్లో రైతులు వాటి సాగుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పెట్టుబడి ఎక్కువ కావడం, తెగుళ్ల బెడద అధికంగా ఉండడం, కోతులు, పక్షులు, వన్యప్రాణులు పంటలకు నష్టం కలిగిస్తుండడం వంటి కారణాలు కూడా ఆహార పంటల సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణం.
ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం..
ఈ క్రమంలో కేంద్రం ఖరీఫ్ సీజన్‌లో వరి నుంచి పప్పుధాన్యాలు, నూనెగింజలు, మినుములు, మొక్కజొన్నలకు మారే రైతులకు హెక్టారుకు రూ. 35 వేల చొప్పన ప్రోత్సాహం ఇవ్వాలని అశోక్ గులాటీ నేతృత్వంలోని ఐసీఆర్‌ఐఈఆర్ ఆర్థికవేత్తల పత్రం సూచించింది. ఐదేళ్లపాటు దీనిని అమలు చేయడం ద్వారా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించవచ్చని తెలిపింది. పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయడంటోపాటు ప్రోత్సాహాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50గా చెల్లించాలని సూచించింది. హరియాణా ప్రభుత్వం ఇప్పటికే హెక్టారుకు రూ.17,500 ఇస్తోందని, కేంద్రం కూడా మరో రూ.17,500 చెల్లించాలని సూచించింది.
ఎరువుల వినియోగం తగ్గిస్తే..
ఇక కమిటీ మరో ఆసక్తికరమైన విషయం సూచించింది. విద్యుత్, కాలువ జలాలు, ఎరువుల రాయితీలపై ఆదా చేసినట్లయితే పంజాబ్‌లోని భూములు అత్యంత సారవంతమవుతాయని తెలిపింది. ఇష్టానుసారంగా రసాయన ఎరువుల వాడకంతో భూములు జీవం కోల్పోతున్నాయని తెలిపింది. హరియాణాలోనూ భూములు నిర్జీవంగా మారడానికి కారణం అదే అని తెలిపింది.
ఇప్పటికే అమలు..
ఇదిలా ఉంటే.. పంజాబ్‌కు చెందిన రైతు సంఘాలకు కేంద్ర మంత్రుల బృందం పప్పుధాన్యాలు, మొక్కజొన్న, నూనెగింజల సాగుచేస్తే ఐదేళ్లపాటు ప్రభుత్వ సేకరణకు హామీ ఇచ్చింది. ప్యాకేజీ అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే అశోక్ గులాటీ నివేదిక వచ్చింది. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ విపత్తు నుండి పంజాబ్, హరియాణా, ఢిల్లీ రాష్ట్రాలను రక్షించవచ్చని తెలిపింది. వరి సాగుతో ఇష్టానుసారం బోర్లు, బావులు తవ్వడం ద్వారా భూగర్భ జలాలు తగ్గుతున్నాయని తెలిపింది.
ఆ రెండు రాష్ట్రాల్లో వరిసాగు..
పంజాబ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి 2023-24లో హెక్టారుకు రూ.38,973 రాయితీలు ఇచ్చినట్లు తెలిపింది. పొలం కోత తర్వాత పంట అవశేషాలను నిర్వహించడానికి అదనపు రాయితీ ఇస్తే ఆర్థిక సహాయం హెక్టారుకు రూ.40 వేలు దాటుతుందని పేర్కొంది. సబ్సిడీలతో వరి లాభదాయకంగా ఉండడంతో పంజాబ్, హరియాణా రైతులు వరి సాగుకే మొగ్గు చూపుతున్నారని తెలిపింది. ఇతర పంటల సాగుతో వచ్చే లాభంతో పోలిస్తే.. వరితోనే ఎక్కువ ఉంటుంది. సజ్జల సాగుతో పోల్చినప్పుడు వరికి హెక్టారుకు రూ.68,849 ప్రోత్సాహం అందింది. ఇది ఇతర పంటలకు అందుబాటులో లేదు. ఈ నేపథ‍్యంలో పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో వరి సాగు నుంచి 12-14 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేయాలని కమిటీ సూచించింది. విద్యుత్ సబ్సిడీ పునరుద్ధరించడం ద్వారా హెక్టారుకు రూ.30,000 నుంచి రూ.40,000 ముందస్తు ప్రోత్సాహకం అందించించడం ద్వారా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసే అవకాశ ఉంటుందని తెలిపింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Rs 35 thousand per hectare if rice is left a key proposal for farmers to switch to other crops
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com