ఏపీలో జగన్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది ప్రకటించిన పథకానికి ఇప్పుడు జీవో జారీచేసింది. కరోనా కారణంగా మృతి చెందిన వారికి అంత్యక్రియలకు రూ.15వేలు అందించనున్నట్లు జీవో ఆర్టీటీ నెంబర్ 236ను ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి విడుదల చేశారు. అంత్యక్రియలకు అవసరమైన నిధులను విడుదల చేయాలని కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. దీంతో కరోనా మృతుల కుటుంబాలకు కాస్త రిలీఫ్ కానున్నదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ఇంతవరకు బాగానే ఈ పథకం అమలుపై అనుమానాలున్నాయని అంటున్నారు. వాస్తవానికి కరోనా మృతులకు రూ.15 వేలు ఇచ్చేది గతేడాది ప్రకటించిన పథకమే. అయితే సంవత్సర కాలంగా ఒక్కరికి కూడా ఈ మొత్తాన్ని అందించలేదు. పైగా గతేడాది కరోనా కేసులు పెరిగినా మృతుల సంఖ్య తక్కువగా ఉండేది. ప్రస్తుతం రోజూ వందల కొద్దీ మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందరికీ అందేలా ఏ విధమైన చర్యలు తీసుకుంటుందోనని అనుకుంటున్నారు.
గతేడాది కరోనా కాలంలో ప్రభుత్వం కరోనా నుంచి కోలుకున్న వారికి రూ.2వేలు, రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికి మూడు మాస్కులు, మరణించి వారికి కూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే మొదట్లో రూ.2వేలను కొందరికి ఇచ్చారు. ఆ తరువాత వాటిపై ఎవరూ దృష్టి పెట్టలేదు. దీంతో రాను రాను ఆ పథకాల గురించి ప్రజలు కూడా మరిచిపోయారు.
తాజాగా కరోనా మృతులకు రూ.15వేల విషయాన్ని తెరపైకి తేవడంతో దాని అమలులో ఎంత పారదర్శకం ఉంటుందోనని అంటున్నారు. కరోనాపై జగన్ సర్కార్ చేతులెత్తేసిందని కొందరు ఎంపీ సీక్రెట్ గా మాట్లాడుకున్న విషయాలు బయటకొచ్చాయి. దీంతో ప్రభుత్వం ఈ 15 వేల అంశాన్ని ఎంతమేరకు సక్సెస్ చేస్తుందో చూడాలని అంటున్నారు.