YS Jagan Vs RRR: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు శనివారం మళ్లీ తనదైన శైలిలో ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారుపైన విమర్శలు చేశారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్న ఆర్ఆర్ఆర్..ఆ తర్వాత శ్రీశ్రీ కవితలు చదివి మరి ఏపీలోని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. పీఆర్సీపైన ఉద్యోగుల నిరసనను ఆర్ఆర్ఆర్ సమర్థించారు. ఈ క్రమంలోనే ఉద్యోగులను జగన్ సర్కారు మోసం చేసిందని ఆరోపించారు ఆర్ఆర్ఆర్.
ఉద్యోగులను బుజ్జగించడానికి వేసిన కమిటీలో బుగ్గన, నాని, సజ్జల, సమీర్ శర్మ, బొత్స ఉన్నారని చెప్పారు. ఉద్యోగులు సమ్మె చేయడానికి వెళ్లినా జగన్ సర్కారు పట్టించుకోని విధంగా ప్రవర్తిస్తుందని హెచ్చరించారు. ఏపీలో ఆర్థిక పరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలిచ్చే పరిస్థితి లేదని తెలిపారు. ఐఆర్ ఇచ్చి ఉద్యోగులను ఏపీ సర్కారు మభ్య పెట్టిందని తెలిపారు. ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వడం ద్వారా ఏపీ సర్కారుపైన రూ.17 వేల కోట్లు భారం పడుతున్నదని ఆర్ఆర్ఆర్ చెప్పారు. అయితే, ఐఆర్‌తో పాటు పీఆర్సీ ఇవ్వాల్సిన సర్కారు మొండి చేయి చూపే అవకాశాలున్నాయని ఆరోపించారు.
Also Read: వందల కోట్లు ఉన్న నిర్మాతకు ఆర్ధిక సాయం అవసరమా జగన్ ?
ఇకపోతే రాష్ట్రంలో విమానాశ్రయాలపైన ప్రభుత్వం ఆలోచించడం మింగ మెతుకు లేదు..మీసాలకు సంపెంగ నూనె అన్న రీతిన ఉందని విమర్శించారు. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తనకు ఫాంటోఫోబియా ఉందని విమర్శించాడని గుర్తు చేశాడు. మొత్తంగా నరసాపురం ఎంపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపైన తనదైన శైలిలో పలు విషయాలపైన సుదీర్ఘంగానే విమర్శించారు.
అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆర్ఆర్ఆర్ తెలిపారు. స్టాట్యూటరీ పేమెంట్స్ కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుందని ఏపీ సర్కారుకు సూచించారు. వైసీపీ అరాచకాలు ఆపడం కోసం తన వంతుగా ఒంటరి పోరాటం చేస్తున్నానని ఆర్ఆర్ఆర్ చెప్పారు. ఉద్యోగులు, ప్రజలకు మధ్య గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని ఆర్ఆర్ఆర్ ఆరోపించారు. ఓటీఎస్ స్కీమ్ వసూళ్ల కోసమేనని అన్నారు. సంక్షేమం కాస్తా సంక్షోభంలోకి వెళ్తున్నదని అన్నారు. ఉద్యోగులదే విజయమని ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ జోస్యం చెప్పారు.
Also Read: ఆర్ఆర్ఆర్ VS సీఎం జగన్.. నరసాపురం ఎంపీ స్థానం ఎవరికి సొంతం..?