Road Safety : రోడ్డు మీద ప్రయాణించే ట్రక్కులు, బస్సులు, ఈ రిక్షాలు ఇక పై మరింత సురక్షితం కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ వాహనాల భద్రతను పెంచేందుకు కీలక చర్యలు తీసుకుంటోంది. ట్రక్కులు, బస్సుల కోసం ‘భారత్ NCAP’ తరహా సేఫ్టీ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అలాగే, ఈ-రిక్షాల సేఫ్టీని మెరుగుపరిచేందుకు కూడా కొత్త నిబంధనలు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.
Also Read : రోడ్డుపై ఉన్న ఈ నెంబర్ తో ఇన్ని ప్రయోజనాలా? ఇన్నాళ్లు తెలియలేదే..!
ట్రక్కులు, బస్సులకు సేఫ్టీ రేటింగ్
గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ట్రక్కులు, భారీ కమర్షియల్ వెహికల్స్ సేఫ్టీ రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోందన్నారు. ఈ విధానం కింద, ట్రక్కులు, బస్సులను ‘భారత్ NCAP’ తరహాలోనే క్రాష్ టెస్టింగ్ చేస్తారు. రిజల్ట్ ఆధారంగా 1 నుండి 5 స్టార్స్ వరకు సేఫ్టీ రేటింగ్ ఇస్తారు. తయారీదారులు తమ వాహనాల బిల్డ్ క్వాలిటీని మెరుగుపరచడానికి ఈ విధానం ప్రోత్సహిస్తుందని, తద్వారా వాహనాలు మరింత సురక్షితంగా మారుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ-రిక్షాలకు కొత్త నిబంధనలు
దేశంలో బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాల సేఫ్టీ పై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. ఈ వాహనాల్లో భద్రతా లోపాలు ఉన్నాయని గుర్తించిన ప్రభుత్వం, వాటి ప్రమాణాలను, భద్రతా మూల్యాంకన వ్యవస్థ(Security Evaluation System)ను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోంది. ఈ-రిక్షాల్లో సేఫ్టీని మెరుగుపరచడం వల్ల వాటి క్వాలిటీ పెరుగుతుందని, తద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
2023లో ‘భారత్ NCAP’ను ప్రారంభించిన మంత్రి గడ్కరీ, 3.5 టన్నుల వరకు వెహికల్స్ రోడ్డు సేఫ్టీ ప్రమాణాలను మెరుగుపరచడమే దాని లక్ష్యమన్నారు. భారతదేశంలో ఏటా అత్యధిక సంఖ్యలో ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 4.8 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు భద్రత, రోడ్ల విస్తరణ, వెహికల్ సేఫ్టీ, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలని గడ్కరీ తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో లాజిస్టిక్ ఖర్చులను ప్రస్తుత 14-16 శాతం నుంచి 9 శాతానికి తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ట్రక్ డ్రైవర్ల పని గంటలను నిర్ణయించడానికి కూడా ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపొందించనుంది. ప్రస్తుతం వారు రోజుకు 13-14 గంటలు వాహనాలు నడుపుతున్నారు.
Also Read : రేసింగ్ పిచ్చి శృతి మించింది.. అది ఎంతటి దారుణానికి దారి తీసిందంటే.. వీడియో వైరల్