Homeజాతీయ వార్తలుModi KCR Politics : మోడీ, కేసీఆర్ లకు ఆర్కే మార్క్ హెచ్చరిక

Modi KCR Politics : మోడీ, కేసీఆర్ లకు ఆర్కే మార్క్ హెచ్చరిక

Modi KCR Politics : సమాజంలో ఎంతోమంది జర్నలిస్టులు ఉంటారు. అందరూ సుద్ద పూసలు కావాలని ఏమీ లేదు.. జర్నలిజం అంటేనే ప్రశ్నించడం కాబట్టి.. ప్రశ్న ఎంత సూటిగా తగులుతుంది అనేది ఇక్కడ ముఖ్యం. లోతుల్లోకి వెళ్లడం లేదు గాని.. ఇప్పుడు తెలుగు నాట కొద్దో గొప్పో ప్రశ్నించే సామర్థ్యం ఉన్న జర్నలిస్టుల్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒకడు. టిడిపికి డప్పు కొట్టే విషయం మినహాయిస్తే మిగతా విషయాల్లో ఎంతో కొంత జర్నలిస్టిక్ టెంపర్ మెంట్ ప్రదర్శిస్తాడు. ప్రతివారం కొత్త పలుకులో రాజకీయ వర్తమానాన్ని తనదైన శైలిలో రాస్తూ ఉంటాడు. గత మూడు వారాలుగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాల మీద తనదైన మార్క్ వ్యాసాలు రాస్తున్నాడు. ఈ ఆదివారం కూడా వర్తమాన రాజకీయాలపై మరీ ముఖ్యంగా తెలంగాణ విషయంలో కెసిఆర్, మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తెలంగాణ మీద మీ ప్రయోగాలేలా?

తెలంగాణ పోరాడి సాధించుకున్న రాష్ట్రం. ఎంతో జీవవైవిద్యం, మరెంతో సాంస్కృతిక నేపథ్యం ఉన్న రాష్ట్రం. ఈ రాష్ట్రం మీద మీ పెత్తనం ఏంటి? మీరు ఐదేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో 5 ఏళ్ళు.. కష్టించి పనిచేస్తే మరి కొన్నేళ్లు అధికారంలో ఉంటారు. అధికారం మీకు ఎప్పుడూ శాశ్వతం కాదు కదా! ఒక మునుగోడు ఎన్నిక కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటాపోటీగా రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేశాయో చూశాం! ఇది ప్రజాస్వామ్యస్ఫూర్తికి విఘాతం కలిగించడం లేదా? ఇలా అందరినీ భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలిచేస్తే రేపటినాడు తెలంగాణ సమాజం ఎలాంటి సందేశాన్ని భారతదేశానికి అందిస్తుంది? మునుగోడు ఉప ఎన్నికలో 670 కోట్ల దాకా ఖర్చయిందని అంటున్నారు. ఇవే డబ్బులను ఆ నియోజకవర్గ అభివృద్ధికి వెచ్చిస్తే ఎంత బాగుంటుంది? మీరు కోరుకున్న అభివృద్ధి ఏ రూపంలో జరిగితే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి?.. ఇలా సాగింది ఆర్కే విశ్లేషణ. ఏ మాటకు ఆ మాట. ఈ మధ్యకాలంలో ఈ ఇద్దరు నేతల్ని ఇలా చెడుగుడు ఆడుకున్న జర్నలిస్టు లేరు. పైగా అధికార పార్టీల అడుగులకు మడుగులు ఒత్తకుంటే పాలకులు చేస్తున్న ఆర్థిక ఒత్తిళ్లను మనం చూస్తున్నాం. అయినప్పటికీ తగ్గేదే లే అనుకుంటూ రాధాకృష్ణ రాసిన రాత ఎంతోకొంత సమాజాన్ని జాగృతం చేసే విధంగా ఉన్నది.

ఏం సందేశం ఇస్తున్నట్టు

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అమలు చేసి దెబ్బతిన్న మోడల్ నే ఇప్పుడు తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు బిజెపి నాయకత్వం ప్రయత్నిస్తోంది.. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా రాజకీయాలకు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.. నిన్న మొన్నటి వరకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఆ రాష్ట్ర గవర్నర్ చికాకు పెట్టాడు.. ఇప్పుడు కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలతో గవర్నర్లు తలపడుతున్నారు.. కేంద్రం అండదండ లేకుంటే గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలతో తలపడతారని భావించలేం. తెలంగాణ గవర్నర్ , కెసిఆర్ ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటున్నది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణ రాష్ట్రానికి అంత మంచిది కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాలు బాగుపడతాయని తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత వాతావరణం గమనిస్తే జీవితాలు బాగుపడకపోయినా పర్వాలేదు మా మానాన మమ్మల్ని బతకనీయండి అని వేడుకొనే పరిస్థితులు వచ్చాయి. ఇలా రాసుకుంటూ వచ్చిన ఆర్కే.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదు. ఈ సమయంలో ఏపీ ప్రస్తావన వచ్చినప్పుడు ఎప్పటిలాగే జగన్ పై తన అక్కసు ప్రదర్శించాడు. జగన్ ప్రభుత్వం త్వరగా పతనం అయిపోవాలని కోరుకున్నాడు.. తన స్వామి భక్తిని ప్రదర్శించాడు. ముందుగానే మనం చెప్పుకున్నాం కదా టిడిపి ప్రస్తావన లేకుంటే ఆర్కే నిఖార్సయిన జర్నలిస్ట్ లాగా కనిపిస్తాడు. లేకుంటే తన పచ్చ అభిమానాన్ని ఎప్పటిలాగే ప్రదర్శిస్తాడు..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular