Weapons: అగ్రరాజ్యాలు ఆధిపత్యం కోసం పాకులాడుతున్నాయి. ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. సాంకేతికతను ఉపయోగించుకుని క్షిపణుల తయారు చేస్తూ శత్రు దేశాలకు హెచ్చరికలు పంపుతున్నాయి. రష్యా, అమెరికా, చైనా పోటీ పడుతూ హైపర్ సోనిక్ ఆయుధ పరీక్షలు చేపడుతున్నాయి. ధ్వని కంటే వేగంగా దూసుకెళ్లే ఆయుధాలు తయారు చేసుకుంటున్నాయి. అగ్రరాజ్యాల మధ్య కుదిరిన ఒప్పందాలకు చెల్లుచీటి ఇస్తూ తమ లక్ష్య సాధనకు పూనుకుంటున్నాయి.

చైనా ఇప్పటికే హైపర్ సోనిక్ క్షిపణిని లాంగ్ మార్చ్ రాకెట్ పై ప్రయోగించినట్లు తెలుస్తోంది. దీంతో అమెరాకాలో కంగారు మొదలైంది. చైనా కుట్రలతో దాడి చేస్తే పరిస్థితి ఏమిటనేది దాని భయం. ఈ నేపథ్యంలో ఆయుధాల వినియోగంలో అగ్రరాజ్యాలు పోటీ పడుతుండటంతో ఆయుధాల కోసం అమెరికా, రష్యా లాంటి దేశాలు వెంపర్లాడుతున్నాయి. చైనా పరీక్షించిన కొత్త ఆయుధంతో రాడార్లకు అందనంత ఎత్తులో దిశలను మార్చుకుంటూ దక్షిణ ధృవం వైపు నుంచి దాడి జరిగే అవకాశం ఉందని అమెరికా భయపడుతోంది.
ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచంలోని దేశాల్లో విద్వేషాలు రగులుతున్నాయి. ఒక దేశంపై మరో దేశం పగబూనడం చూస్తూనే ఉన్నాం. దీంతో ఎవరి రక్షణ కోసం ఆ దేశం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇతర దేశాలకు మార్గనిర్దేశకాలు చేస్తున్నా వాటి రక్షణ కోసం మాత్రం అవి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలు వాటి ఆత్మరక్షణ కోసం అన్ని విధాలుగా ఆలోచిస్తున్నాయి.
భారత్, ఫ్రాన్స్, జపాన్, ఉత్తర కొరియా, ఆస్రేలియా దేశాలు కూడా తమ ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు పావులు కదుపుతున్నాయి. దాయాది దేశాల తీరుతో ఆత్మరక్షణలో పడిపోతున్నాయి. ఏ దేశంతో ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే కవ్వింపులు పెరుగుతున్న నేపథ్యంలో తమను తాము రక్షించుకునేందుకు చర్యలు తీసుకునేందుకే నిర్ణయించుకుంటున్నాయి. తమ ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు పెద్దపీట వేస్తున్నాయి.