Telangana: తెలంగాణలో ఇక ‘వరి’ పంటకు మంగళమేనా?

Telangana: ప్రభుత్వం వరి సాగు చేయొద్దని చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనలేమని చెబుతున్న నేపథ్యంలో రాష్ర్టంలోని బాయిల్డ్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. దీంతో వరి సాగు వైపు రైతులు ఆలోచన చేయవద్దని చెబుతున్నారు. మనది అన్నపూర్ణ రాష్ర్టమని పేరు తెచ్చుకున్న క్రమంలో వరి సాగు వద్దనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వం చెబుతున్న దానికి రైతులు ఒప్పుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. యాసంగిలో వరి పంట వేయొద్దని సూచిస్తున్నారు. ఆరుతడి పంటలైన […]

Written By: Raghava Rao Gara, Updated On : September 13, 2021 3:52 pm
Follow us on

Telangana: ప్రభుత్వం వరి సాగు చేయొద్దని చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం బియ్యం కొనలేమని చెబుతున్న నేపథ్యంలో రాష్ర్టంలోని బాయిల్డ్ మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని తెలుస్తోంది. దీంతో వరి సాగు వైపు రైతులు ఆలోచన చేయవద్దని చెబుతున్నారు. మనది అన్నపూర్ణ రాష్ర్టమని పేరు తెచ్చుకున్న క్రమంలో వరి సాగు వద్దనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వం చెబుతున్న దానికి రైతులు ఒప్పుకుంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

యాసంగిలో వరి పంట వేయొద్దని సూచిస్తున్నారు. ఆరుతడి పంటలైన శనగలు, వేరుసెనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు, ఆముదాలు, కూరగాయలు వంటి వాటిని సాగు చేయాలని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం సూచించిన విధంగా ఆరుతడి పంటల వైపు అన్నదాతలు అడుగులు వేస్తారా అనేదే ప్రశ్న. వరి సాగుకు అలవాటు పడిన రైతులు ఇప్పుడు పంటను మార్చాలంటే సాధ్యమేనా అని ఆలోచన వస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎంత మేర విజయం సాధిస్తుందో చూడాల్సిందే.

తెలంగాణలో గత యాసంగిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రం ఎఫ్ సీఐ ద్వారా త్వరగా తీసుకుంటే వర్షాకాలంలో ఉత్పత్తయ్యే పంట నిల్వకు సరిపడా స్థలం లభిస్తుందని పేర్కొంటూ ఇటీవల రాష్ర్ట మంత్రులు గంగుల కమలాకర్, కేటీఆర్ లు కేంద్ర పౌరసరఫరాల శాక మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి విన్నవించారు. ఇప్పటికే కేంద్రం వద్ద అయిదేళ్లకు సరిపడా నిల్వలున్నాయని చెప్పారు. దీంతో వరి సాగుకు రైతులు మొగ్గు చూపొద్దని సూచిస్తున్నారు.

గత యాసంగిలో రాష్ర్టం 92 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఈ వర్షాకాలంలో 55 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. దీంతో 1.40 కోట్ల టన్నుల దిగుబడి వస్తుంది. ఇప్పటికే 70 లక్షల టన్నుల ధాన్యం మిల్లుల్లోనే నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో వరి సాగు వద్దంటూ ప్రభుత్వం రైతులకు చెబుతోంది. గత యాసంగిలో సేకరించిన ధాన్యం వల్ల సుమారు రూ.2 వేల కోట్ల అదనపు భారం పడనుంది.

ఈ వానకాలంలో కేంద్రం నిర్ధారించిన 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లను ఐకేపీ కేంద్రాల ద్వారా కోటా మేరకు మాత్రమే ధాన్యం సేకరణ చేయాలి. దీంతో ప్రభుత్వం వరి సాగు చేయొద్దని చెబుతోంది. వ్యవసాయ శాఖ ద్వారా ప్రచారం చేయాలని భావిస్తోంది.