
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ1983 నుంచి విజయం సాధించలేదని గుర్తు చేశారు. అయినా అక్కడ విజయం కోసం శ్రమిస్తానని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీ డబ్బులు కుమ్మరించేందుకు రూ.200 కోట్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు.కానీ తాము కేవలం కార్యకర్తలతోనే పోరాడతామని గుర్తు చేశారు.
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఒక్క రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవని అన్నారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్తుతామని చెప్పార. అయితే మా లక్ష్యం 2023 ఎన్నికలే అని పేర్కొన్నారు. హుజురాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసకుంటున్నట్లు బీజేపీ నేతలు ప్రకటిస్తున్నా అది వాస్తవం కాదన్నారు. బీజేపీ తరఫున బరిలో దిగుతున్న ఈటల రాజేందర్ కు సొంత నియోజకవర్గంలో గట్టి పట్టున్న సంగతి తెలిసిందే. అక్కడ విజయం సాధిస్తే అది బీజేపీ విజయం కాదని ఆయన వ్యక్తిగత విజయమని చెప్పారు.
ఈటల రాజేందర్ కు నియోజకవర్గంతో అనుబంధం ఉందన్నారు. ఇక్కడ గత కొంత కాలం నుంచి ఇక్కడి నుంచే ఆయన గెలుస్తున్నారు. దీంతో ఆయన ఇమేజ్ తోనే ఎన్నికల్లో విజయం సాధిస్తారని తెలిపారు. దీనికి బీజేపీ తమ పార్టీ విజయంగా చూసుకోవద్దని సూచించారు. దీనిపై మేధావులు సైతం అదే విషయం చెబుతున్నారు. ఈటల వ్యక్తిగత విజయంగా చూడాలే తప్ప పార్టీ గెలుపుగా గుర్తించలేమన్నారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సర్వత్రా చర్చీనీయాంశం అవుతోంది. బీజేపీలో అందరిలోనూ ఆలోచన రేకెత్తిస్తోంది. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లతో పార్టీలో కూడా గుసగుసలు మొదలయ్యాయి. బయటకు చెప్పలేకున్నా లోలోపల ఉడికిపోతున్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో పార్టీలో గందరగోళం నెలకొంది. భవిష్యత్తులో ఈటల గెలిచినా బీజేపీకి క్రెడిట్ దక్కకుండా చేయడంలో రేవంత్ వ్యూహం పన్నినట్లు భావిస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీ అధిస్టానం కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆరా తీస్తోంది. రేవంత్ మాటల్లో నిజమెంత? అనే దానిపై ఆలోచనలో పడ్డారు. రాబోయే రోజుల్లో ఈటల రాజేందర్ విజయం సాధించినా అది బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుందా ? లేదా అనే అనుమానాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో పార్టీ ప్రయోజనాల దృష్ట్యా అధిష్టానం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.