రేవంత్ రెడ్డి మొదలు పెట్టాడు.. మొదటి ఫైట్ కు సిద్ధమయ్యాడు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 200 మందితో ఇందిరాపార్క్ దగ్గర సమావేశం నిర్వహించేందుకు పోలీసులు అనుమతించారు.
ఇందిరాపార్క్ నుంచి రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా వచ్చి గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు టీ కాంగ్రెస్ నేతలకు అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఇందిరా పార్క్ తోపాటు రాజ్ భవన్ కు వచ్చే మార్గంలో పలు చోట్ల పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.
‘చలో రాజ్ భవన్’ కార్యక్రమాన్ని నిబంధనలు అతిక్రమించి నిర్వహించే అవకాశం ఉండడంతో అడ్డుకునేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. ఇక చోలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని అడ్డుకుంటే పోలీస్ స్టేషన్లనే ముట్టడిస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన మొదటి యుద్ధాన్ని ధరాఘాతంపైనే సంధిస్తున్నారు. పెట్రోల్, డీజీల్ ధరల పెంపునకు నిరసనగా చేపట్టారు. ఇక పార్లమెంట్ లోనూ దీనిపై గళమెత్తుతానంటున్నాడు. ఇలా మొదలైన ఉద్యమం రెండోసారి ‘నిరుద్యోగం’పై చేపడుతున్నట్టు తెలుస్తోంది.