Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈమేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌పై ఈటల రాజేందర్‌ను బరిలో దింపాలని నిర్ణయించింది. ఎప్పటి నుంచే రాజేందర్ తాను కేసీఆర్‌పై పోటీ చేస్తానని అంటున్నారు. ఇందుకు అనుగుణంగానే బీజేపీ ఈటలకు టికెట్ ఇచ్చింది. ఈమేరకు ఈటల కూడా రంగంలోకి దిగారు. గురువారం గజ్వేల్‌లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ లాంటి భూస్వాములకు రైతుబంధు నిలిపివేస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఏటా 150 ఎకరాలకు రూ.15 లక్షల రైతుబంధు తీసుకుంటున్నారని తెలిపారు. తనను కేసీఆర్ వాడుకుని ఎలా గెంటేసింది వివరించారు. ఇప్పటికే ఈటల రాకతో కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు కామారెడ్డి బరిలో కూడా నిలవాలని నిర్ణయించుకున్నారు.
కామారెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్..
ఒకవైపు గజ్వేల్‌లో ఈటలతో రెండోస్థానంలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న కేసీఆర్‌కు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. ఆయనపై కామారెడ్డి నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని బరిలో నిలపాలని నిర్ణయించింది. ఈమేరకు రెండో జాబితాలో పేరు ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది. మరోవైపు స్థానిక కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీని కామారెడ్డి నుంచి నిజాబాబాద్ అర్బన్‌కు షిఫ్ట్ చేసినట్లు సమాచారం. నిజామాబాద్ అర్బన్ టికెట్‌ను మహేశ్‌కుమార్‌గౌడ్ ఆశించారు. అయితే ఆయనను రెండు రోజుల క్రితం ఢిల్లీకి పిలిపించిన ఏఐసీసీ, నిజాబాబాద్ అర్బన్ టికెట్ మైనారిటీకి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈమేరకు మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఒప్పించింది. దీంతో ఆయన స్థానంలో షబ్బీర్ అలీకి రెండో జాబితాలో టికెట్ ఇవ్వనున్నట్లు తెలిసింది.
కేసీఆర్‌ను ఢీకొట్టనున్న రేవంత్..
ఈ ఎన్నికల్లో ఒక్క చోట అయినా కేసీఆర్‌ను ఓడించాలని విపక్షాలు భావిస్తున్నాయి. కోల్‌కత్తాలో మమతాబెనర్జీపై బీజేపీ సువేందో అధికారిని బరిలో నిలిపి గెలిపించింది. అదే తరహాలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గజ్వేల్‌లో ఓడించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈటలను బరిలో దింపారు. మరోవైపు రెండో స్థానం వెతుక్కున్న కేసీఆర్‌కు.. తాజాగా టీపీసీసీ చీఫ్ షాక్ ఇచ్చారు. మొన్నటి వరకు కొడంగల్‌లో పోటీ చేయాలని సవాల్ చేసిన రేవంత్‌రెడ్డికి కేసీఆర్ గురువారం ఎన్నికల ప్రచార సభలో కౌంటర్ ఇచ్చారు. నా దమ్ము ఏంటో దేశం మొత్తం తెలుసు అని వ్యాఖ్యానించారు. దీనిని చాలెంజ్‌గా తీసుకున్న టీపీసీసీ చీఫ్ కామారెడ్డిలో కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు రెడీ అయ్యారు. ఇలా రెండు చోట్ల కేసీఆర్‌పై విపక్షాలు బరిలో దిగడం ద్వారా ఆయనను కట్టడి చేయాలనే వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్‌పై రెండు జాతీయ పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలు బరిలో దిగనుండడంతో కేసీఆర్‌కు కూడా గెలుపు సులభం కాబోదని పేర్కొంటున్నారు.
రెండు స్థానాల్లో పోటీచేసి విపక్షాలను కన్ఫ్యూజన్‌లోకి నెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ భావించారు. కానీ ఆయన ఊహించని విధంగా కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు రచించాయి. ఇద్దరు కీలక నేతలను కేసీఆర్‌పై పోటీకి పెట్టి ఎత్తుకు పైఎత్తు వేశాయయి. మరి ఎవరి ఎత్తులు ఫలిస్తాయో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాలి.
Web Title: Revanth wants to contest from kamareddy shabbir ali shift to nizamabad urban
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com