Revanth Reddy: అప్పట్లో టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి.. తనకున్న లాబియింగ్ ద్వారా పీసీసీ అధ్యక్షుడయ్యాడు. తర్వాత ఏవో సభలు, సమావేశాలు పెట్టి కాంగ్రెస్ పార్టీలో తన ఉనికిని గట్టిగానే చాటుకున్నాడు. రాహుల్ గాంధీని తెలంగాణకు పిలిపించి, వరంగల్ డిక్లరేషన్ ప్రకటించాడు.. తన వర్గానికి చెందిన వారికి పదవులు ఇప్పించుకుని కాంగ్రెస్ పార్టీపై తిరుగులేని పెత్తనం చెలాయించాడు. సాధారణంగానే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ పోకడ సీనియర్లకు నచ్చలేదు. పైగా వీరందరూ కూడా ప్రగతి భవన్ కు దగ్గరి వారు కావడంతో రేవంత్ రెడ్డికి పొగ మొదలైంది.

-భట్టి సారథ్యంలో
రేవంత్ రెడ్డి రాకను మొదటి నుంచి భట్టి విక్రమార్క, ఆయన అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. అప్పట్లో రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిని చేయవద్దంటూ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లకు పలుమార్లు విజ్ఞప్తులు కూడా చేశారు. అయితే వీరి గురించి తెలిసిన రాహుల్ గాంధీ వారి మాటలను పట్టించుకోకుండా రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిని చేశారు. అప్పటినుంచి ఇప్పటిదాకా సమయం దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.. అంతేకాదు ఆయన వర్గాన్ని ” ఎల్లో బ్యాచ్” అంటూ గేలీ చేస్తున్నారు. వారి దెబ్బకు విసుగెత్తిపోయిన రేవంత్ రెడ్డి వర్గం తమ పదవులకు రాజీనామా చేసింది. దీంతో ఈ పంచాయితీ అధిష్టానం వద్దకు చేరింది.
-మరింత కార్నర్ అయ్యే అవకాశం
రేవంత్ పరిస్థితి కాంగ్రెస్ లో మరింత కార్నర్ అయ్యేలా ఉంది.. దీనికి ప్రధాన కారణం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో యాక్టివేట్ అయ్యే ప్రయత్నం చేయడమే.. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాజయంతో చంద్రబాబు మళ్ళీ తెలంగాణ పేరు గట్టిగా ఎత్తలేదు. అయితే ఏపీలో రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు చంద్రబాబు తెలంగాణలో మళ్ళీ అడుగు పెట్టారు.. అంతేకాదు తన పాత తమ్ములను మళ్ళీ చేరాలి అంటూ ఆయన బహిరంగ పిలుపునిచ్చారు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి పొగ పెడుతున్న నేపథ్యంలో… చంద్రబాబు పిలుపును అందుకొని టిడిపిలో ఆయన చేరకపోవచ్చు.. ఎందుకంటే తెలంగాణ టిడిపి అధ్యక్షుడు అనిపించుకోవడం కంటే.. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనిపించుకోవడమే రేవంత్ రెడ్డి కి మర్యాద, గౌరవం. ఏ రకంగా చూసినా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీని బలమైనది.. రేవంత్ తన రాజకీయ భవిష్యత్తు అనుకుంటే కష్టమో, నష్టమో కాంగ్రెస్ లోనే ఉండవచ్చు.. మరీ వీలు కాదనుకుంటే భారతీయ జనతా పార్టీకి జై కొట్టవచ్చు.

రేవంత్ శత్రువులు ఊరికే ఉండరు.. ఆయనపై విరుచుకుపడతారు.. వాస్తవానికి కాంగ్రెస్లో ఇలాంటి అసహనాలు కొత్త కాదు.. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి వారి నోటికి స్వేచ్ఛ చాలా ఎక్కువగా ఉంటుంది.. పైగా చాలామంది సీనియర్లు ప్రగతి భవన్ తో టచ్ లో ఉన్న నేపథ్యంలో రేవంత్ పొడ వారికి అసలు గిట్టదు. ఇప్పటికే రేవంత్ పై బొచ్చెడు ఫిర్యాదులను సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు.. మరోవైపు చంద్రబాబు తెలంగాణలో రాజకీయం చేస్తున్న సమయంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ఉంచడం శల్యుడికి పగ్గాలు అప్పగించడం లాంటిదేనని సీనియర్లు కొత్త పల్లవి అందుకున్నారు.. మొన్న తెలంగాణకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ కు కూడా ఇదే చెప్పారు.. కానీ ఆయన మాత్రం ఏమీ తేల్చకుండా వెళ్ళిపోయారు. మరి రేవంత్, సీనియర్ల పంచాయితీ పరిష్కరించేదెవరు? అటు చూస్తే రాహుల్ గాంధీ జోడో యాత్రలో ఉన్నారు.. ఇటు చూస్తే మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో వచ్చేసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే తలంపుతో తలమునకలై ఉన్నారు. మరో ఏడాది తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో హస్తవ్యస్తంగా మారిన కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టేది ఎవరో?