Revanth Reddy: కాంగ్రెస్ ప్రజా గర్జన పేరుతో నిర్వహించిన సభ సక్సెస్ అయింది. సభకు ఆటంకాలు సృష్టించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. అయినా.. సభకు భారీగా జనం తరలివచ్చారు. పీపుల్ మార్చ్ పాదయాత్ర ముగింపుతోపాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరిక సభ కావడంతో పార్టీ ఈ వేదిక మీదుగానే తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించింది. సభ ఫెయిల్ అవుతుందని బీఆర్‌ఎస్ భావించినా సక్సెస్ కావడంతో ఆ పార్టీ నేతలక నిద్ర పట్టడం లేదు. మరోవైపు బీఆర్‌ఎస్‌తో దోస్తీ లేదని, విపక్ష కూటమిలో కూడా చాన్స్ లేదని ఈ సభా వేదిక నుంచే రాహుల్‌గాంధీ ప్రకటించారు. బీఆర్‌ఎస్ కూటమిలో ఉంటే.. కాంగ్రెస్ అందులో ఉండదని స్పష్టం చేశారు. తద్వారా బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌కు పొత్తు ఉండదని, బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీం అని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ విమర్శలు..
సభ ముగిసిన మరు క్షణమే బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు రాహుల్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. రాహుల్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇక ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు నూతన రైతు చట్టాలకు తాము మద్దతు ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయం రాహుల్‌కు తెలుసని పార్లమెంట్‌లో చట్టాలకు వ్యతిరేకంగా పోరాడామని కూడా గుర్తుచేశారు. పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఖమ్మం సభ జరిగిన తీరును విమర్శించారు. రాహుల్ ఆరోపణలను ఖండించారు.
రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
ఖమ్మంలో కాంగ్రెస్ సభ విజయవంతకావడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తన నివాసంలో ప్రెస్‌మీట్ పెట్టారు. సభకు ఎన్ని ఆటంకాలు సృష్టించినా విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ చేసిన ఆరోపణలను విమర్శిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉద్దేశించి ‘అసలు నక్క తప్ప, వేట కుక్కలన్నీ బయటకు వచ్చి మొరుగుతున్నాయి’ అని తీవ్ర విమర్శ చేశారు. ట్విట్టర్ పిట్ట, మందులో సోడా కలిపేటోళ్లంతా వచ్చి రాహుల్ ను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఏ హోదాలో రాహుల్ ఇక్కడికి వచ్చారని ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ నేతలకు బుద్ధి లేదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చింది రాహుల్‌గాంధీ కుటుంబమన్నారు. రాహుల్ గాంధీకి కాకుండా ఇంకెవరికి తెలంగాణలో పర్యటించే అర్హత ఉన్నదని ప్రశ్నించారు. అన్నం తినే వారెవ్వరూ రాహుల్ ను ప్రశ్నించరని పేర్కొన్నారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నా రాహుల్ గాంధీ ఎలాంటి పదవి తీసుకోలేదన్నారు. కాళేశ్వరం అవినీతిపై రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ముమ్మాటికి నిజమన్నారు.