Revanth Reddy: టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక పార్టీ క్యాడర్‌లో జోష్ నింపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసి, పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్రం అంతాట సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు అన్ని అంశాలపై అప్‌డేట్‌గా ఉంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఇటీవల ముందస్తు ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారు. ఈ సారి కూడా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారని జోష్యం చెప్పారు. ఈ మాటలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశం అయ్యింది.
స్పష్టత ఇవ్వాల్సి వచ్చిన సీఎం కేసీఆర్
ఇటీవల ఓ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. కేసీఆర్ మళ్లీ ముందస్తు ఎన్నికల ఆలోచనలో ఉన్నారని, ఖచ్చితంగా ముందస్తు ఎన్నిక ఉంటుందని అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలు రాజకీయ నాయకులను ఆలోచనలో పడేశాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు. తొందరగా ప్రభుత్వం రద్దయితే పరిస్థితి ఎలా ఉంటుందోనని కలవరపడుతున్నారు. దీంతో ఈ విషయంపై సీఎం కేసీఆర్ స్పందించాల్సి వచ్చింది. ముందస్తు ఎన్నికలు ఉండబోదని, పూర్తి కాలంపాటు పారిపాలన చేస్తామని స్పష్టత ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ నింపేందుకేనా ?
సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండబోదని స్పష్టత ఇచ్చినా.. రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నారు. వచ్చే యేడాది ఆగస్టు తరువాత అసెంబ్లీని రద్దు చేసి, కచ్చింగా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చెబుతున్నారు. ఇదే వాదనను ఆయన కాంగ్రెస్ శ్రేణులతో బలంగా వినిపిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ క్యాడర్‌ను అలెర్ట్‌గా ఉంచి జోష్ నింపేందుకే చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు.
Also Read: కరోనాతో 30 రోజుల్లో మరణిస్తే పరిహారం.. ఈ పరిహారాన్ని ఎలా పొందాలంటే?
నాయకులు పార్టీ మారకుండా ఉండేందుకేనా ?
కాంగ్రెస్ పార్టీలోని నాయకులు ఇతర పార్టీలోకి వెళ్లపోకుండా, క్యాడర్ చేజారిపోకుండా ఉండేందుకు రేవంత్ రెడ్డి ముందస్తు ఎన్నికల వాదనను బలంగా వినిపిస్తున్నారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలు వస్తే ఇతర పార్టీల నాయకులు కూడా కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉంటుందని భావనలో రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయన ముందస్తు ఎన్నికలు వస్తాయని చెబుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఆయన చెప్పిన విధంగా తొందరగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా ? లేదా అనే విషయం తెలియాలంటే వేచిచూడాల్సిందే.
Also Read: నవంబర్ నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులా.. అసలు నిజమేంటంటే?