Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నాయకులు విమర్శలు, ప్రతివిమర్శలతో ప్రచార వేడి పెంచుతున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం చప్పగా సాగుతుండగా, కేటీఆర్, హరీశ్‌రావు మాత్రం సవాళ్లు, హెచ్చరికలతో ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే తెలంగాణ పదేళ్లు వెనక్కి వెళ్తుందని భయపెడుతున్నారు. హరీశ్‌రావు అయితే హైదరాబాద్ అమరావతి అవుతుందని బెదిరిస్తున్నారు. ఇక కేసీఆర్ కరెంటు ఉండదని, తెలంగాణ అంధకారం అవుతుందని చెబుతున్నారు. కేటీఆర్ అయితే కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా అని అడుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఉచిత కరెంటు ఇవ్వడంతోపాటు కల్వకుంట్ల ఫ్యామిటీ కరెంట్ కట్ చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, దయాకర్‌రావు, సంతోష్‌రావు, కవితారావు పవర్ పీకేస్తామని తెలిపారు.
తాజాగా మరో సవాల్
బీఆర్‌ఎస్ మూకుమ్మడిగా కాంగ్రెస్‌పై కరెంటు చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా తిప్పి కొడుతున్న రేవంత్.. బుధవారం కేసీఆర్‌కు మరో సవాల్ విసిరారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్న ఆరోపణలపై రేవంత్ తెలంగాణలో ప్రస్తుతం ఎక్కడ 24 గంటల కరెంటు ఇస్తున్నారో నిరూపించాలని సవాల్ విసిరారు. కామారెడ్డి చౌరస్తాకు కేసీఆర్ లాంగ్ బుక్ పట్టుకుని రావాలన్నారు. 24 గంటల కరెంటు ఇచ్చినట్లు నిరూపిస్తే.. తాను కొడంగల్, కామారెడ్డిలో నామినేషన్ విత్‌డ్రా చేసుకుంటానన్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఉప సంహరణకు గడువు ఉన్నందున.. దమ్ముంటే కేసీఆర్ తన సవాల్ స్వీకరించాలన్నారు.
బీఆర్‌ఎస్ నేతల మౌనం..
కరెంటుపై కాంగ్రెస్ సవాల్ కొత్తేమీ కాదు. గతంలో కోమటిరెడ్డి, ఉత్తమ్‌రెడ్డి,తోపాటు అనేక మంది సవాల్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలు మాత్రం ముందకు రావడం లేదు. తాజాగా రేవంత్ నామినేషన్ విత్‌డ్రా చేసుకుంటానని సవాల్ చేశారు. తాము 24 గంటలు కరెంటు ఇస్తున్నామని చెబుతున్న బీఆర్‌ఎస్‌కు ఇది మంచి అవకాశం. సవాల్‌ను స్వీకరించి నిరూపించి టీపీసీసీ చీఫ్ నామినేషన్ విత్‌డ్రా చేసుకునేలా ఒత్తిడి చేయవచ్చు. కానీ గులాబీ నేతలు మళ్లీ ముఖం చాటేశారు. అంటే 24 గంటల కరెంటు ఇవ్వడం లేదనే విషయం మరోసారి రుజువైంది. ఈ సవాల్ ద్వారా రేవంత్ సక్సెస్ అయినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.