కాంగ్రెస్ పార్టీ ఇంద్రవెల్లి బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. సభను విజయవంతం చేయాలని సన్నాహాలు చేసింది. రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభను మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో లక్ష మంది దళితులు, గిరిజనులు పాల్గొనేలా కసరత్తు చేసింది. అయితే ఈ బహిరంగ సభకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి గైర్హాజరు కానున్నారు. జ్వరం కారణంగా ఆయన సభకు రావడం లేదుని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నేతలు ఉత్సాహం నింపేందుకు సిద్ధమవుతున్నారు. ఇంద్రవెల్లి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు, శ్రేణులు కృషి చేస్తున్నారు. ఇంద్రవెల్లి సభపై అధికార టీఆర్ఎస్ నాయకులు ఘాటు విమర్శలు చేస్తున్నారు. దళితులు, గిరిజనులు దశాబ్దాల పాటు మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంక్షేమ పథకాలపై ప్రశ్నించే హక్కు లేదని మండిపడుతున్నారు. గిరిజనులు, ఆదివాసీలపై కాల్పులకు తెగబడిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వారిపై లేనిపోని ప్రేమ ఒలకబోయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
గిరిజనులు,ఆదివాసీలను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోందని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉండి ఇప్పుడు వారి సంక్షేమం కోసం అంటూ నీతులు చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇంద్రవెల్లి ఆదివాసీ అమరుల త్యాగాలను కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం పావుగా వాడుకుంటోందని దుయ్యబట్టారు.
అయితే దళిత, గిరిజన దండోరా సభను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు. తుడుందెబ్బ ప్రతినిధులు కూడా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీని అణచివేయడానిి కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ సందేహాలు వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఎవరు వెళ్లొద్దని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు పిలుపునివ్వడంతో బహిరంగ సభ నిర్వహణపై అనుమానాలు కలుగుతున్నాయి.