Revanth Reddy: ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ బంధం ఫెవికాల్ కంటే బలమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వారి బంధాన్ని ఎవరు విడదీయలేరని చెబుతున్నారు. తెలంగాణ రాష్ర్టం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే. దాని ఫలాలు మాత్రం వేరే వాళ్లు అనుభవిస్తున్నారు. నోముకున్న వాడి బూరె నోచుకున్నోడు తిన్నట్లు ఉంది. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వారి కుటుంబాలకు మాత్రం ఏ ప్రయోజనం దక్కలేదు. చెట్టు ఒకరు పెడితే పండ్లు మాత్రం వేరే వాళ్లు తింటున్నారు. నిరుద్యోగం పెరిగిపోతోంది. ఉద్యోగుల భవిష్యత్ అంధకారంగా మారుతోంది. పీఆర్సీ ఇవ్వకుండా తాత్సారం చేస్తూ వారిలో ఆగ్రహం తెప్పిస్తున్నారు.
తెలంగాణలో భవిష్యత్ అంధకారం అయిపోతోంది. ధరల పెరుగుదలతో ప్రజలు కుదేలైపోతున్నారు. నిరుద్యోగం, రుణమాఫీ, గిట్టుబాటు ధరలు, ప్రాజెక్టుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. డిసెంబర్ 9 నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోంది. రోజుకు పది లక్షల మందిని చేర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 17న గజ్వేల్ లో నిర్వహించే దళిత, గిరిజన దండోరా మహాసభకు రాహుల్ గాంధీని ఆహ్వానించారు.
ఢిల్లీలో తెలంగాణ భవన్ ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై లేదని రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. వారం రోజులపాటు ఢిల్లీలో మకాం వేసి ప్రజా ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ తాకట్టు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ఢిల్లీలో అమరవీరుల స్తూపం కట్టించాల్సిందని సవాలు చేశారు. కేసీఆర్ మోడీ చలవతోనే మనగలుగుతున్నారు. మోడీ చొరవతోనే కేసీఆర్ పనులు చక్కబెట్టుకుంటున్నారు.
తెలంగాణలో ఉప ఎన్నికకు పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్పడం ఆయనకే చెల్లింది. ఢిల్లీలో అమరవీరుల స్తూపం కోసం ఎకరం స్థలం ఇస్తే బాగుంటుంది. పార్టీ కార్యాలయంతో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఇతరులకు పెద్దగా లాబం ఉండదని వ్యాఖ్యానించారు. మోడీ, అమిత్ షాల బలంతో కేసీఆర్ ఆస్తులు కూడబెడుతున్నారు. కేసీఆర్ కపట నాటకాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. పరిపాలనలో ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మోసం చేస్తున్నారు. దీనిపై ఎన్నిమార్లు చెబుతున్నా ఆయనలో మార్పు కనిపించడం లేదు.