Jupalli- Ponguleti: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లనున్నారు. ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారు అయిన నేపథ్యంలో రేవంత్ ఇద్దరు నేతల ఇళ్లకు వెళ్లి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ ఇద్దరి చేరిక కాంగ్రెస్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
ముందుగా జూపల్లి నివాసానికి, ఆ తర్వాత పొంగులేటి ఇంటికి… బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత రేవంత్‌రెడ్డి ముందుగా అత్తాపూర్ సమీపంలోని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ జూపల్లితో భేటీ అయి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారు. తర్వాత జూపల్లిని వెంటబెట్టుకుని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు సమీపంలో ఉన్న పొంగులేటి ఇంటికి వెళ్తారు.అక్కడే ముగ్గురు నేతలతో పాటు మరికొందరు ముఖ్యులు భోజనం చేస్తారని, ఆ సమయంలోనే రేవంత్‌రెడ్డి వారందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలుస్తోంది.
సాయంత్రం ఢిల్లీకి రేవంత్..
పొంగులేటి అండ్ టీంతో సమావేశమైన తర్వాత రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. విదేశాల నుంచి ఢిల్లీకి వస్తున్న రాహుల్‌తో గురువారం సమావేశమవుతారని, ఆయనతో మాట్లాడిన తర్వాత పొంగులేటి అండ్ టీం కలిసేందుకు రాహుల్ అపాయింట్‌మెంట్ తీసుకుంటారని తెలుస్తోంది. ఈనెల 25న లేదంటే నెలాఖరులోపు ఏదో ఒక రోజు రాహుల్‌గాంధీ వీలును బట్టి పొంగులేటి, జూపల్లి అండ్ టీం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరికపై అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
చేలిక లాంఛనమే అయినా.. అనుమానాలు..
చేరిక లాంఛనమే అని అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్ బహిష్కృత నేతలు ప్రకటించడం లేదు. ప్రయత్నం చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు తప్ప ఇప్పటి వరకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గానీ, జూపల్లి కృష్ణారావుగానీ అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఇంకా క్లారిటీ లేనట్లే అనిపిస్తోంది. కొంతమంది కాంగ్రెస్ నేతల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సీట్ల విషయంలోనే ఇద్దరు నేతలు పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. రాహుల్‌తో భేటీ తర్వాతనే స్పష్టమైన హామీ వస్తేనే చేరిక ఉంటుందని తెలుస్తోంది.