CM Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి హీరోను చేశారు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు జరుగనున్న వేళ.. ఏపీ కాంగ్రెస్‌కు.. కాదు కాదు.. జాతీయ కాంగ్రెస్‌కు శత్రు సమానుడైన రాజకీయ ప్రత్యర్థిని తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి పొగడడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఏం జరిగిందంటే..
కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్‌ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్‌మెట్ బోర్డు)కు అప్పగించిందని రెండు రోజులుగా తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రయోజనాలను కేంద్రానికి రేవంత్‌రెడ్డి తాకట్టు పెట్టారని ప్రచారం చేస్తోంది. అయితే దీనిని ఖండించేందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబుతో కలిసి మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయంలోనే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి కేసీఆర్ తాకట్టు పెట్టారని రేవంత్ ఆరోపించారు. ఈమేరకు గతంలో జారీ చేసిన జీవోలు, జరిగిన ఒప్పందాలను ఉదహరించారు.
చంద్రబాబును మాట అనకుండా..
ఇక ఈ ప్రెస్‌మీట్‌లో రేవంత్ తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడును పల్లెత్తు మాట కూడా నలేదు. గతంలో కాంగ్రెస్ నుంచి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖరరెడ్డిని విమర్శించారు. ఆయన హయాంలో కేసీఆర్ తన స్వార్థం కోసం కొన్ని నిర్ణయాలను అడ్డుకోలేదని ఆరోపించారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అనేక లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు.
జగన్‌ను పొగుడుతూ..
ఈ క్రమంలో కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్న ఫ్లోలో రేంత్‌రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌ను హీరో చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ జగన్ మోహన్‌రెడ్డి తన పోలీసులతో నాగార్జున సాగర్ డ్యాంపైకి వచ్చి తెలంగాణ అధికారులకు తుపాకులు పెట్టి ఏపీకి నీటిని తరలించుకుపోయాడని తెలిపారు. కేసీఆర్ మాత్రం తెలంగాణ నీటిని ఏపీ తరలించుకుపోతున్నా చూస్తూ ఊరుకున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం జగన్ తెలంగాణను ఎదురించాడని తెలిపారు. తమ రైతుల కోసం జగన్ తెలంగాణతో కొట్లాడడానికి కూడా సిద్ధమయ్యాడని పేర్కొన్నారు.
ఏపీ ఎన్నికల్లో ప్రభావం..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే స్వయంగా ఏపీ సీఎం జగన్‌ను పొగడడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయింది. పొగిడితే గురువు చంద్రబాబును పొగడాలి.. లేదంటే కాంగ్రెస్ నేతల పోరాటాన్ని ప్రశంసించాలి. కానీ రేవంత్ కేసీఆర్‌ను విమర్శించే క్రమంలో జగన్‌ను హీరో చేశారు. ఏపీ ప్రజల కోసం ఎంతకైనా కొట్లాడే నేతగా అభివర్ణించారు. సీఎం వ్యాఖ్యల ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.