Homeజాతీయ వార్తలుRevanth Reddy : రేవంత్ పై కేసీఆర్ మోపిన ‘రిటైర్డ్ భారం 1,049’

Revanth Reddy : రేవంత్ పై కేసీఆర్ మోపిన ‘రిటైర్డ్ భారం 1,049’

Revanth Reddy : 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఇస్తే ఐదు లక్షల కోట్లకు మించి అప్పు అయ్యింది. జీవధార అని ప్రచారం చేసుకుంటూ నిర్మిస్తే కాలేశ్వరం ఎత్తిపోతల పథకం మేడిగడ్డ రూపంలో కుంగిపోయింది. అన్నారం పంప్ హౌస్ ఇసుక మేటలు వేసింది. మల్లన్న సాగర్ భూకంప జోన్ లో ఉంది. విద్యుత్ శాఖ ఆస్తులకు మించి అప్పుల్లో ఉంది. ఎటు చూసుకుంటే అటు అప్పులు.. ఎన్నో సమస్యలు.. ఫలితంగా వాటి దిద్దుబాటు కోసం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు తెలియదు కానీ.. ఇటీవల వివిధ శాఖల్లో పాతుకుపోయిన రిటైర్డ్ అధికారులు ఎంతమంది ఉన్నారో.. ఆ జాబితా తనకు తేవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వ వర్గాలను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో ఎంతమంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో అధికారులు లెక్క తీస్తే కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు తెలిసాయి.

మొత్తం రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న విశ్రాంత అధికారులు మొత్తం 1049 మంది ఉన్నట్టు సాధారణ పరిపాలన శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో.. ఆయన తిరిగి వచ్చిన తర్వాత అందజేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటే వీరి తొలగింపు పై ఒక స్పష్టత వస్తుందని అధికారులు అంటున్నారు. అత్యధికంగా పురపాలక శాఖలో 179 మంది, విద్యా శాఖలో 88 మంది, పౌర సరఫరాల శాఖలో 75 మంది, రోడ్లు భవనాల శాఖలో 70 మంది, పంచాయతీరాజ్ శాఖలో 48 మంది అధికారులు రిటైర్డ్ అయినప్పటికీ ఉద్యోగాలు చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి రెండు పర్యాయాలు అధికారంలోకి రావడంతో.. ఆనాటి ప్రభుత్వ పెద్దలు తమకు అనుకూలమైన వ్యక్తులను కన్సల్టెంట్లుగా, సలహాదారులుగా, ఈఏఎన్సీ లుగా కొనసాగారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన, వాటి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా ఉన్న అధికారులు చాలా సంవత్సరాల క్రితమే రిటైర్డ్ అయినప్పటికీ వారిని తీసుకువచ్చి కీలకమైన పోస్టుల్లో కూర్చోబెట్టారు. అయితే వారిలో చాలామంది టర్మ్ ఎప్పటి వరకు అనేది స్పష్టం చేయకుండా అన్ టిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని ఉత్తర్వులు ఇవ్వడం విశేషం. లక్షల్లో జీతాలు, వాహనాల సదుపాయం, సిబ్బంది కేటాయింపు ఇలా అన్ని సౌకర్యాలు కేటాయించడంతో ప్రభుత్వం పై ఏటా వందల కోట్ల భారం పడింది. 1049 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నెలకు 150 కోట్లు, సంవత్సరానికి 1800 కోట్లను వేతనాలుగా చెల్లించిందని సమాచారం.

గత ప్రభుత్వం కీలక పోస్టుల్లో ఐదుగురు రిటైర్డ్ ఐఏఎస్ లను నియమించింది. సెక్రటేరియట్ లో ప్రోటోకాల్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న అరవిందర్ సింగ్, ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్, కస్టమర్లకు శాఖలో స్పెషల్ సిఎస్ గా ఆదర్ సిన్హా, లేబర్ డిపార్ట్మెంట్లో స్పెషల్ సిఎస్ గా రాణి కౌముది, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉమర్ జలీల్ వంటి వారిని అప్పటి ప్రభుత్వం నియమించింది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీరిని రిలీవ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆర్టీసీ లో ఒక మహిళా కన్సల్టెంట్ కు 7 లక్షల జీతం చెల్లిస్తున్నారు. కార్పొరేషన్కు సాఫ్ట్వేర్ డెవలపింగ్ కంపెనీకి మధ్య ఆమె కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఆ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆర్టీసీలో ఉన్నతాధికారి స్నేహితుడికి సంబంధించినదని, సంస్థకు ఐటీ సేవలు అందిస్తున్నందుకు దానికి ఏడాదికి ఎనిమిది కోట్ల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. మరో రిటైర్డ్ ఐపీఎస్ ను సీఈవోగా నియమించి నెలకు 1.5 లక్షల జీతం చెల్లిస్తున్నారని తెలుస్తోంది. ఔట్సోర్సింగ్ పద్ధతిలో చాలామందిని లక్షకు పైగా జీతంతో బస్సు భవన్లో ఓ ఉన్నతాధికారి నియమించినట్టు సమాచారం. ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్, రిటైర్డ్ అధికారులకు ప్రతినెల 6.5 లక్షలు జీతాల రూపంలో చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంపై ప్రభుత్వం పకడ్బందీగా విచారణ నిర్వహిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular