ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ రైతు వ్యతిరేకులే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రైతులు చేస్తున్న ఆందోళనలో ఆయన పాల్గొని ఈమేరకు కేంద్రంపై విరుచుకుపడ్డారు. రైతు పక్షపాత ప్రభుత్వమని చెబుతూ వారిని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సేవ్ ఫార్మర్స్, సేవ్ ఇండియా అంటూ నినాదాలు చేశారు. రైతుల ఆందోళనలు పట్టించుకోని ప్రధాని నరేంద్ర మోడీపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిది నెలలుగా ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలు పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు.
రైతులు చేస్తున్న ఆందోళనలపై ఇంతవరకు నిర్ణయం తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎంత మంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నా కేంద్రానికి పట్టడం లేదని విమర్శించారు. చనిపోయిన రైతు కుటుంబాలకు పార్లమెంట్ లో సంతాపం తెలియజేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ అనుమతించడం లేదని అన్నారు. ప్రధాని, సీఎం ఇద్దరు నిరంకుశంగా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి లాభం లేకుండా పోతోందని వాపోయారు.
బడా బాబుల కోసమే చట్టాలు తెస్తున్నారని అన్నారు. వ్యవసాయ చట్టాలు రైతుల కోసం కాదని పేర్కొన్నారు. కేవలం ధనవంతులకు వంత పాడటానికే కేంద్రం సుముఖంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ప్రధాని మోడీ, అమిత్ షాను కలిసిన తరువాత కేసీఆర్ లొంగిపోయారని అన్నారు. ఇప్పటికైనా ప్రధాని నిరంకుశ విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు.
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారని గుర్తు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా కేంద్రం పెడచెవిన పెడుతోందని విమర్శించారు. రైతుల పక్షాన నిలబడి పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళతామని పేర్కొన్నారు.