KCR Vs Revanth Reddy: రాజకీయాలలో హత్యలు ఉండవు. కేవలం ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. దేశంలో మాత్రమే కాదు తెలంగాణలో జరిగిన పలు పరిణామాలు వాక్యాలకు బలం చేకూర్చాయి. తాజాగా ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో తనకు శత్రువుగా రేవంత్ రెడ్డిని నిలుపుకోవడం పట్ల కెసిఆర్ కూడా “రాజకీయాల్లో ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి” అనే నానుడిని మరొకసారి నిజం చేశారు. ఎందుకంటే కెసిఆర్ తీసుకున్న నిర్ణయాలే ఎందుకు ప్రధాన కారణం. వాస్తవానికి ఓటుకు నోటు కేసులో స్టీఫెన్ సన్ కు ఎర్రబెల్లి దయాకర్ రావు, సండ్ర వెంకట వీరయ్య ద్వారా డబ్బులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్లాన్ ముందుగానే లీక్ కావడంతో హరీష్ రావు రంగంలోకి దిగారు. దయాకర్ రావు స్థానంలో రేవంత్ రెడ్డిని పంపించారు. తర్వాత రేవంత్ రెడ్డిని జైల్లోకి పంపించారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలవకుండా చేశారు. ఆయన బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు పగలగొట్టి ఇబ్బంది పెట్టారు.
సానుభూతి పొందారు
ఇలాంటి పరిణామాలు అధికార పార్టీకి కిక్ ఇస్తాయి కాబోలు.. కానీ వాటి వల్ల బాధితుడైన వ్యక్తికి ప్రజల్లో సానుభూతిని పెంచుతాయి. ప్రస్తుతం రేవంత్ ఈ స్థాయిలో ఎదగడం వెనుక ప్రధాన కారణం ఆ సానుభూతే. కెసిఆర్ పదేపదే టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి రాజకీయంగా చాలా ఎదిగాడు. కెసిఆర్ విధానాలను ప్రశ్నిస్తుండడంతో తెలంగాణ పౌర సమాజం కూడా రేవంత్ వైపు చూడటం ప్రారంభించింది. దీనివల్ల రేవంత్ రెడ్డి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగాడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా వెలుగులోకి వచ్చాడు.
అతి వద్దు
తెలంగాణ సమాజం ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. గౌరవాన్ని ఎక్కువగా కోరుకుంటుంది. కెసిఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల రేవంత్ రెడ్డి పలుమార్లు జైలుకు వెళ్లినప్పుడు సహజంగానే ఆయన ప్రజల నుంచి సానుభూతి పొందారు. అధికార పార్టీ, అధికార మీడియా చిలువలు పలువలుగా ప్రచారం చేయడం వల్ల రేవంత్ రెడ్డి మైలేజ్ పొందారు. ఇది అంతిమంగా ఆయన రాజకీయ ప్రయాణం మరింత మెరుగయ్యేందుకు కారణమైంది. ఒకవేళ కెసిఆర్ నాడు ఓటుకు నోటు కేసును సీరియస్ గా తీసుకోకుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు. రేవంత్ ను పదే పదే టార్గెట్ చేయకుండా ఉండి ఉంటే భారత రాష్ట్ర సమితి ప్రస్తుత ఎన్నికల్లో ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండేది కాదు. చివరికి కేసీఆర్ రోజుకు మూడు నియోజకవర్గాలు చొప్పున ప్రచారం చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. రేవంత్ రెడ్డిని పదేపదే గెలకడం ద్వారా కెసిఆర్ స్వయంకృతాపరాధం చేసుకున్నారు. ఇప్పుడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సానుకూల పవనాలు వీస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం కేసీఆర్ అయితే.. రెండవ కారణం ఆయన రేవంత్ రెడ్డి మీద పెట్టించిన కేసులు.. స్థూలంగా చెప్పాలంటే నిన్నటిదాకా తనకు శత్రువే లేడు అని విర్రవీగిన కెసిఆర్ కు.. రేవంత్ రెడ్డి రూపంలో శత్రువు కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. ఏకంగా కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడు.. చూడాలి మరి డిసెంబరు 3న ఏం జరుగుతుందో..