మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సీఎం, మంత్రులు, పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. కాబట్టి తనకు 4 ప్లస్ 4 గన్ మెన్ లతో పాటు ఎస్కార్ట్ కల్పించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ హైకోర్టులో రిట్ వేశారు రేవంత్.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తనకు 3ప్లస్3 సెక్యూ రిటీ ఉండేదని, తర్వాత 2ప్లస్2కు తగ్గించారన్నారు. 2018 ఎన్నికల సమయంలో హైకోర్టు ఆదేశాల మేరకు 4ప్లస్4కు పెంచినా, మళ్లీ 2ప్లస్2కు తగ్గించేశారని చెప్పారు. దీంతో 2019 ఆగస్టులో కేంద్రానికి సెక్యూరిటీ పెంచాలని దరఖాస్తు చేసుకున్నానని, అది పరిశీలనలో ఉందని జవాబు వచ్చిందని, ఆ దరఖాస్తును ఆమోదించి భద్రత కల్పించేలా కేంద్ర హోంశాఖకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.
కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న భూ దందా వ్యవహారం పై పోరాటం చేస్తున్నాను. ఈ క్రమంలో కోట్ల రూపాయల విలువైన భూములను జూపల్లి రామేశ్వరరావుకు కట్టబెట్టడం పై తాను పోరాటం చేశానని, ఈ నేపథ్యంలో తన ప్రాణాలకు హాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రిట్ పిటిషన్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావులను ప్రతివాదులుగా చేశారు.