Residents Sleep On Mumbai Beach: అది సుప్రసిద్ధమైన సముద్రం.. అందమైన వెర్సోవా తీర ప్రాంతం.. సాయంత్రమైతే చాలు అక్కడ చాలామంది చాపలు చంకలో పట్టుకొని వెళ్తున్నారు. వెళ్లడం మాత్రమే కాదు.. రాత్రి మొత్తం అక్కడే.. తెల్లవారుజామున ఇంటికి వస్తున్నారు. వారేం చేస్తున్నారు.. ఎందుకలా చేస్తున్నారు.. మొదట్లో చాలామంది పట్టించుకోలేదు. ఇప్పుడు వారు చేస్తున్న వ్యవహారం ఏకంగా దేశంలోనే సంచలనంగా మారింది.
ఇబ్బంది పడుతున్నారు
దేశవ్యాప్తంగా వర్షాలు కురవడం లేదు. పసిఫిక్ సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో రుతుపవనాలు విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం లేదు. దీంతో వర్షాలు కురవడం లేదు. ఫలితంగా దేశంలో వాయవ్య ప్రాంతం మినహా మిగతా అన్నిచోట్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. చినుకు జాడలేదు. కనీసం ఇంట్లో కునుకు తీద్దామంటే అనుకూలమైన వాతావరణం లేదు. విపరీతమైన ఉక్క పోత తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది.
చాప చేతిలో పట్టుకొని..
ఇంట్లో పడుకునే అవకాశం లేకపోవడంతో మహారాష్ట్రలో చాలామంది చాపలు చేతిలో పట్టుకొని అక్కడ సముద్ర తీర ప్రాంతానికి వెళ్తున్నారు. ముఖ్యంగా మురికి వాడలలో ఉండేవారు చాపలు చంకలో పెట్టుకుని సముద్రతీరా ప్రాంతానికి వెళ్లి.. రాత్రి మొత్తం అక్కడే పడుకుంటున్నారు. దిండు.. దుప్పట్లతో అక్కడే రాత్రి మొత్తం గడిపి.. తెల్లవారుజామున ఇంటికి వస్తున్నారు..
కరెంటు కోతలు
కొద్ది రోజులుగా మహారాష్ట్రలో కరెంటు కోతలు విపరీతంగా ఉంటున్నాయి. ముఖ్యంగా రాత్రిపూట కరెంటు కోతల వల్ల అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.. మురికి వాడల ప్రదేశాలలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది.. అందువల్లేవారు రాత్రిపూట సుఖవంతమైన నిద్ర కోసం సముద్ర తీర ప్రాంతానికి వెళ్తున్నారు.. ఇటీవల జాతీయ మీడియా ప్రతినిధులు ఈ ఫోటోలు తీయడంతో.. మురికివాడల ప్రజల బాధలు వెలుగులోకి వచ్చాయి.. ఇంత జరుగుతున్నప్పటికీ మహారాష్ట్రలో కరెంటు కోతలు తగ్గకపోవడం విశేషం. వర్షాలులేకపోవడంతో కరెంట్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా రాత్రి సమయంలో వినియోగం ఎక్కువగా ఉంటున్నది. అందువల్లే ఈ మురికి వాడల ప్రజలు సుఖ నిద్రకోసం సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తున్నారు.
