Vijayasai Reddy: వైసీపీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్ తగిలింది. అయితే షాక్ అనేకంటే ఘోర అవమానం జరిగింది. రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ సభ్యుడిగా రెండు రోజుల కిందట విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. ఆయన పేరు ప్రకటిస్తూ రాజ్యసభ ప్రత్యేక ప్రకటన సైతం విడుదల చేసింది. దీంతో దానికి ధన్యవాదములు తెలుపుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని.. పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తానని కూడా ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి చెప్పుుకొచ్చారు. అయితే దీనికి గంటల గడువు ముగియక ముందే ప్యానల్ సభ్యుల జాబితా నుంచి విజయసాయిరెడ్డి పేరు కనిపించకుండా పోయింది. ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ స్వయంగా ప్రకటించిన పేర్లలో విజయసాయి పేరు లేకపోవడంతో ఆయనకు షాక్ గురిచేసింది. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు హయాంలోనే విజయసాయిరెడ్డికి ప్యానల్ సభ్యుడి పదవి ఉండేది. కానీ కొత్త ఉప రాష్ట్రపతి జగదీప్ రావడంతో మరోసారి ప్యానల్ సభ్యుల ఎంపిక జరిగింది.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. అంతకంటే ముందు నుంచే రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానెల్ సభ్యుల జాబితాను ప్రకటించారు. వివిధ పార్టీలకు చెందిన ఎనిమిది మంది సభ్యులను ఎంపిక చేశారు. అందులో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉంది.దీంతో తనకు దక్కిన గౌరవంగా భావించిన విజయసాయి ధన్యవాదములు కూడా తెలిపారు. అయితే బుధవారం శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని మోదీ సమక్షంలోనే ఉప రాష్ట్రపతి జగదీప్ సభ్యుల పేర్లను ప్రకటించారు. అందులో విజయసాయి తప్ప.. ముందుగా ప్రకటించిన ఏడు పేర్లను వైస్ ప్రెసిడెంట్ చదివారు. దీంతో వైసీపీ వర్గాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. తమ పార్టీ నేత పేరు రాకపోవడంతో ఆరా తీయడం మొదలు పెట్టాయి.
వాస్తవానికి పార్లమెంట్లో సంఖ్యాబలం బట్టి ప్యానెల్ సభ్యులుగా ఎంపిక చేస్తారు. గతంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి పేరును ప్రకటించారు. వెంకయ్య పదవిలో ఉన్నంత కాలం విజయసాయి కొనసాగారు. ఇప్పడు జగదీప్ దిన్ ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఎంపిక కావడంతో కొత్త టీమ్ అనివార్యంగా మారింది. బీజేపీకి చెందిన భువనేశ్వర్ కలితా, సరోజ్ పాండే, సురేంద్రసింగ్ నాగర్ లతో పాటు బీజేడీ నుంచి డాక్టర్ సుష్మిత్ పాత్రా, టీఎంసీ నుంచి సుఖేంద్ శేఖర్ రాయ్, డీఎంకే నుంచి తురచిశివ, కాంగ్రెస్ నుంచి ఎల్.హనుమంతయ్య, వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి పేర్లను బులెటిన్లో ప్రకటించారు. కానీ దానిని సవరిస్తూ.. విజయసాయిరెడ్డి పేరునుతప్పించడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.

ప్యానల్ సభ్యుడిగా విజయసాయిరెడ్డి పేరు మార్పు పెను దుమారానికి దారితీస్తోంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారా? లేక సాంకేతిక లోపమా అన్నది తేలాల్సి ఉంది. అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు ఫలితమేనన్న టాక్ నడుస్తోంది. కొద్దిరోజుల కిందట ఉప రాష్ట్రపతిని రఘురామ రాజు కలిశారు. గౌరవమైన ఎంపీ పదవిలో ఉండి సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రవర్తన నియమావళిని పరిగణలోకి తీసుకొని విజయసాయిరెడ్డి పేరు తప్పించారన్న ప్రచారంసాగుతోంది. అయితే ఇప్పటికే రఘురామ చాలా అంశాలపై ఫిర్యాదులు చేశారని.. వాటిలో దేనికీ స్పందించని కేంద్రం..కేవలం విజయసాయిరెడ్డి విషయంలో మాత్రమే స్పందించడంపై చర్చనీయాంశంగా మారింది. మొత్తానికైతే జాతీయ స్థాయిలో విజయసాయిరెడ్డి పరువు పోయినట్టయ్యింది. దీనిపై ఆయనఎలా స్పందిస్తారో చూడాలి మరీ..