గత కొంతకాలంగా కరోనా విజృంభనతో తెలంగాణలో కొన్ని ప్రాంతాలను రెడ్, కంటైన్మెంట్ జోన్లగా ప్రకటించి కఠినమైన లాక్ డౌన్ నియమాలను అమలుపరుస్తున్నారు.ఈ క్రమంలోనే హైదరాబాద్ లో పలు ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. మర్కజ్ ఘటనతో ఒక్కసారిగా కేసులు పెరిగిపోవడంతో కేసీఆర్ ప్రభుత్వం అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంది.
తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కంటైన్మెంట్ జోన్లను ఫ్రీ చేస్తున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ ను దాటడం లేదు. దీంతో చార్మినార్ జోన్ పరిధిలోని చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నామా, రాజేంద్ర నగర్ లోని క్వారంటైన్ సెంటర్లను తొలగించారు. చాంద్రాయణ గుట్ట సర్కిల్ లో గతంలో 35 పాజిటివ్ కేసులు ఉండగా, 10 కంటైన్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 3 కేంద్రాలను తాజాగా తొలగించారు.
చార్మినార్ సర్కిల్ లో 16 పాజిటివ్ కేసులు ఉండగా 9 కంటైన్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక దాన్ని తొలగించారు. రాజేంద్రనగర్ సర్కిల్ లో 9 పాజిటివ్ కేసులు ఉండగా 7 కేంద్రాలు ఉండేవి. వాటిలో ఐదింటిని తొలగించారు.
అలాగే సికింద్రాబాద్ సంగీత్ చౌరస్తాలో పూర్తి స్థాయిలో కట్టడి చేశారు. మెట్టుగూడ, ఆలుగడ్డబావి నుంచి సికింద్రాబాద్ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఆ ఏరియాలో కరోనా కేసుల ప్రభావం ఎక్కువగా ఉండటం, ఆ పక్కనే గాంధీ ఆస్పత్రి ఉండటంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.