
10Th Paper Leak : రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ సంచలనం సృష్టించింది. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌కు కారణమైంది. రాష్ట్రంలో అనేక రాజకీయ వ్యవహారాలకు కేంద్రబిందువుగా మారింది. అంతే కాదు ఏకంగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని, కస్టడీకి తరలించేదాకా వెళ్లింది. అయితే ఈ కేసులో అందరి సంగతి ఎలా ఉన్నా తీవ్ర ఇబ్బందిపడుతోంది మాత్రం హరీష్ అనే విద్యార్థి.
కమలాపూర్ పరీక్షకేంద్రంలో హిందీ పరీక్ష రాసింది హరీశే. ఇతడి ప్రశ్నపత్రాన్నే శివకృష్ణ లాక్కోన్నాడు. చెట్టు కొమ్మ ఎక్కి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించి ఫోన్ ద్వారా ఫోటో తీసుకున్నాడు. వాట్సాప్‌లో షేర్ చేశాడు. అది పలుగ్రూపుల్లో తిరిగి చివరికి రకరకాల మలుపులు తీసుకుంది. ఆ తర్వాత ఈ వ్యవహారంలో ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు హరీష్ అనే విద్యార్థిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు.
మరుసటి రోజు ఇంగ్లీష్ పరీక్ష రాసేందుకు హరీష్ పరీక్ష కేంద్రానికి వెళ్లగా ‘ నీవల్ల ఐదుగురు పోలీసుల అదపులో ఉన్నారు. ఈ వ్యవహారానికి కారణం నువ్వు. నిన్ను ఐదేళ్లపాటు డీబార్ చేశామని’ ఆ పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పడంతో హరీష్ కన్నీమున్నీరయ్యాడు. దీంతో మీడియా కూడా హరీష్ బాధను కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. వాస్తవానికి హరీష్ పేదకుటుబానికి చెందిన వాడు. తల్లి కూలీ పనులకు వెళ్తుంది. తండ్రి ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తుంటాడు.
తన కొడుకును డీబార్ చేసిన దగ్గర నుంచి వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హరీష్ తండ్రి తెలంగాణ హై కోర్టులో హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశాడు. ‘శివకృష్ణ గోడ దూకి నా కొడుకు ప్రశ్న పత్రాన్ని సెల్ ఫోన్‌లో ఫొటో తీసుకున్నాడు. ఇందులో నా కొడుకు ప్రమేయం లేదు. ఆ సమయంలో అతడు భయభ్రాంతులకు గురయ్యాడు. తర్వాతి రోజు పరీక్ష రాసేందుకు వెళ్తే డీబార్ చేశామని ప్రిన్సిపాల్ చెప్పారు. అంటూ’ హరీష్ తండ్రి పిటిషన్‌లో పేర్కొన్నాడు.
అయితే పిటిషన్‌దారు తండ్రి వాదనలు విన్న కోర్టు ఏకీభవించింది. పదో తరగతి అనేది విద్యార్థి భవిష్యత్‌కు కీలక మెట్టులాంటిదని, పైగా హరీష్ కుటుంబానికి ఎలాంటి నేర చరిత్ర లేకపోవడంతో ఆ విద్యార్థి పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు సోమవారం నుంచి పరీక్ష రాసేందుకు అనుమతులు ఇవ్వాలని విద్యాశాఖను ఆదేశించింది. ఇక ఈ ఘటనలో ఆ పరీక్ష కేంద్రంలో ఇన్విజలేటర్‌గా పని చేస్తున్న ఓ మైనార్టీ ఉపాధ్యాయురాలిని ప్రభుత్వం డిస్మిస్ చేసింది. హరీష్‌కు అనుకూలంగా హై కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ఉపాధ్యాయురాలు కూడా కోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది.