ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయాలనుకున్న ఎలక్ట్రానిక్ ప్లాంట్ విషయంలో.. పారిశ్రామిక దిగ్గజ సంస్థ రిలయన్స్ వెనక్కి తగ్గింది. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో తిరుపతి ప్రాంతంలో 136 ఎకరాల భూమిని కేటాయించారు. కానీ.. ఇప్పుడు రిలయన్స్ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో.. ఎలక్ట్రానిక్స్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్ దూరమైపోయింది.
ఈ ఫ్యాక్టరీ ద్వారా డిష్ టీవీ సెట్ టాప్ బాక్సులతోపాటు, ఇంటర్నెట్ వినియోగంలో ఉపయోగించే డాంగిల్స్ తదితర వస్తువుల తయారు చేయడానికి ఈ యూనిట్ ఏర్పాటు చేయాలని రిలయన్స్ భావించింది. ఇందు కోసం రూ.15 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. టీడీపీ హయాంలో ఈ డీల్ కుదరగా.. వైసీపీ వచ్చిన తర్వాతే భూముల అప్పగింత జరిగింది. ఇప్పటి వరకు 75 ఎకరాలను అప్పగించింది సర్కారు.
కానీ.. రైతులు కోర్టు కెక్కారు. తాము భూములు అప్పగించేది లేదని చెప్పారు. సర్కారు అప్పగించిన 75 ఎకరాల్లో.. దాదాపు 50 ఎకరాలకు సంబంధించి వివాదం నెలకొంది. ఈ కేసులు తేలే వరకు ప్లాంట్ ఏర్పాటు చేసే అవకాశం లేకుండాపోయింది. ఈ భూములకు బదులుగా వడమాల పేట మండలంలోని పాడిరేడు వద్ద ఎలాంటి వివాదాలు లేని భూములు కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ.. రిలయన్స్ అంగీకరించలేది. అంతేకాదు.. అప్పగించిన భూములను కూడా వెనక్కి ఇచ్చేసింది.
ఈ విషయాన్ని తిరుపతి ఏపీఐఐసీ జోనల్ కార్యాలయ అధికారులు ధృవీకరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భూముల కోసం రిలయన్స్ డిపాజిట్ చేసిన డబ్బులను సైతం తిరిగి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. కాగా.. ఈ పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి మరింత ఇబ్బందిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో రాజధాని డిస్ట్రబెన్స్ ద్వారా.. పారిశ్రామికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల నిర్ణయంతో రావాల్సిన పరిశ్రమలు ఆగిపోతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ప్రముఖ సంస్థ రిలయన్స్ తమ ప్లాంట్ ను తరలించాలని నిర్ణయించడం రాజకీయంగా వైసీపీకి ఎదురు దెబ్బేనని అంటున్నారు విశ్లేషకులు.