Reddy Vs Velama In Telangana: రెడ్డి వర్సెస్‌ వెలమ+కమ్మ గ్రూప్‌: తెలంగాణలో సరికొత్త రాజకీయం

కాంగ్రెస్‌ రెడ్డి సమాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించుకుంది. భారత రాష్ట్ర సమితిలో ఆ అవకాశం లేదు కాబట్టి కేసీఆర్‌ లేదా ఆయన కొడుకు.. మరో వ్యక్తి పవర్‌ హౌస్‌గా ఎదిగేందుకు అవకాశం లేదు. దాదాపు ఉండదు. ఇ

Written By: Bhaskar, Updated On : July 10, 2023 7:27 pm

Reddy Vs Velama In Telangana

Follow us on

Reddy Vs Velama In Telangana: మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరిగే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మొన్నటి దాకా వెలమ సామాజికవర్గం తెలంగాణ రాజకీయాలను డామినేట్‌ చేసింది. ఇందుకు గానూ కమ్మ సామాజిక వర్గం సహాయం తీసుకుంది. అయితే ఈ తొమ్మిదేళ్లల్లో తెలంగాణలో గట్టి పట్టున్న రెడ్డి సామాజిక వర్గం ఒకడుగు వెనకేసిందనే చెప్పాలి. ఎందుకంటే కిరణ్‌కుమార్‌ రెడ్డి తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందిన ఏ వ్యక్తి కూడా సీఎం పీఠం వైపు దరిదాపుల్లోకి రాలేకపోయారు. అటు వైపు చూడకకుండా చేయడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కృతర్థులయ్యారు. అంతే కాదు భవిష్యత్‌లోనూ తనకు ముప్పు రాకుండా ఉండేందుకు ఏకంగా వెల్కమ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పరిటాల రవి కుమారుడు వివాహ వేడుకను ఈ గ్రూప్‌ ఏర్పాటుకు వేదికగా మలచుకున్నారని రాజకీయవేత్తలు అంటుంటారు. ఎప్పుడయితే ఈ వేదిక ఏర్పాటయిందో అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌కు ఎదురన్నది లేకుండాపోయింది. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో స్థిరపడిన సీమాంధ్ర కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఈగ్రూప్‌లో చేరిపోయారు. ఏలాగూ వారిది వ్యాపార నేపథ్యం కావడం.. సర్కారు నుంచి ‘మేళ్లు’ దండిగా రావడంతో అంతకంతకూ ఎదిగిపోయారు. పార్లమెంట్‌ ఎన్నికల వరకూ ఈ గ్రూప్‌ ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఎప్పుడయితే తెలంగాణ నాలుగు పార్లమెంట్‌ స్థానాల్లో బీజేపీ పాగా వేయగలిగిందో అప్పుడే వెల్కమ్‌ గ్రూప్‌ తొమ్మిదేళ్ల ప్రస్థానానికి బీటలు వారడం మొదలయింది. బీజేపీ సాధించిన ఈ నాలుగు పార్లమెంట్‌ స్థానాల విజయం తెలంగాణ రాజకీయాలను సమూలంగానే మార్చేసింది.

లెక్కలు మారాయి..

కాంగ్రెస్‌ రెడ్డి సమాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించుకుంది. భారత రాష్ట్ర సమితిలో ఆ అవకాశం లేదు కాబట్టి కేసీఆర్‌ లేదా ఆయన కొడుకు.. మరో వ్యక్తి పవర్‌ హౌస్‌గా ఎదిగేందుకు అవకాశం లేదు. దాదాపు ఉండదు. ఇక భారతీయ జనతాపార్టీ విషయానికి వస్తే మొన్నటి దాకా బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్‌ అధ్యక్షుడిగా పని చేశాడు. మూడేళ్లు పూర్తయ్యాయనే సాంకేతిక కారణం చూపి ఆయన స్థానంలో కిషన్‌ రెడ్డిని నియమించింది. కిషన్‌ రెడ్డి సౌమ్యుడు కాబట్టి నిలదీత అనేది కేసీఆర్‌కు బండి సంజయ్‌ స్టైల్లో ఎదరు కాకపోవచ్చు. ఇక్కడి వరకూ ఇబ్బంద లేకపోయినప్పటికీ రెడ్డి కాంగ్రెస్‌ రూపంలో వెల్కమ్‌ గ్రూప్‌ ను లీడ్‌ చేస్తున్న కేసీఆర్‌కు మాత్రం ఇబ్బంది ఎదరవుతుందనడంలో అతిశయోక్తి లేదు. మొదటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో రెడ్డి సమాజికవర్గానిదే పై చేయి. ఈ తొమ్మిదేళ్లల్లో ఉనికినే మాయం చేసిన వెల్కమ్‌ గ్రూప్‌ పై ఆ సమాజిక వర్గం కుతకుత ఉడికిపోతోంది. అందుకే వెల్కమ్‌ గ్రూప్‌ ఆనుపానుల మీద కొడుతోంది. మొత్తానికి లెక్కలు మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.

ఏకమవుతోంది..

మొన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమానికి ఏకంగా రాహుల్‌గాంధీ వచ్చారు. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఇంకా కొంత మంది కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీగా ఉన్నారు. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు విదేశాల్లో స్థిరపడిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కూడా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి ఆర్థికంగా అండదండలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఆ మధ్య రాహుల్‌గాంధీతో కలిసి రేవంత్‌రెడ్డి అమెరికాలో పర్యటించినప్పుడు దీనికి సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ రూపొందించినట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా తానా సభల్లో కూడా రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అంటే గతంలో వెల్కమ్‌ గ్రూప్‌ ఎలాంటి యుక్తులను అవలంభించిందో.. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. పైగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఒప్పందం ఉంది అని ప్రచారం జరుగుతోంది. ఇలాంటప్పుడు బీఆర్‌ఎస్‌తో నేరుగా కాంగ్రెస్‌ ఢీకొనే వాతావరణం ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్‌ అంటే రెడ్డి సామాజిక వర్గం అని ప్రత్యేకంగా చెపాల్సిన పని లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌ అంటే రేవంత్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి అంటేనే కాంగ్రెస్‌ అని చెప్పారు కాబట్టి.. అంటే 2023లో తెలంగాణలో రాజకీయాలు రసకందాయంలో ఉంటాయి. అది కూడా రెడ్డి వర్సెస్‌ వెల్కమ్‌ గ్రూప్‌ అలియాస్‌ కమ్మ, వెలమ గ్రూప్‌.