
‘‘పరిస్థితి అనుకూలంగా లేదు కాబట్టి.. ప్రత్యామ్నాయం పక్కాగా లేదు కాబట్టి నోరు మూసుకుంటున్నారు గానీ.. వైసీపీలో అంతర్గతంగా వ్యతిరేకత చాలానే ఉంది’’ ఇదీ.. కొంత కాలంగా ప్రచారం అవుతున్న మాట. అయితే.. ఈ అసంతృప్తికి గురవుతున్న వారిలో రెడ్డి సామాజిక వర్గం కూడా ఉందనేది తాజాగా సాగుతున్న ప్రచారం. దీనికి చెబుతున్న కారణం ఏమంటే..
రాష్ట్రంలో పాలన తమకు అనుకూలంగా లేదని వారు భావిస్తున్నారట. తాము అనుకున్నట్టుగా సాగట్లేదని అలుగుతున్నారట. ప్రజల ఓట్లతోనే అధికారం సాధించినప్పటికీ.. వారిని వైసీపీ వైపు తిప్పేందుకు తాము చాలా ప్రయత్నాలు చేశామని అంటున్నారట. ఇది ఒకరిద్దరి అభిప్రాయం మాత్రమే కాదని, చాలా మంది ఈ విధంగానే ఉన్నారని ప్రచారం సాగుతోంది.
నేతల పరిస్థితి ఇలా ఉంటే.. ఎమ్మెల్యేలుగా గెలిచిన రెడ్ల పరిస్థితి మరో విధంగా ఉండేదట. ఎన్నికల గెలవడానికి తమ వద్ద ఉన్నదంతా ఊడ్చి పెట్టామని, గెలిచిన తర్వాత చూసుకుందామని భావించామని, కానీ.. అందుకు అనుగుణంగా పరిస్థితులు లేవని అంటున్నారట. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంతా బాగనే ఉంటుందని భావించినప్పటికీ.. ఇప్పుడు లెక్కలు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
ఇదేకాకుండా.. అభివృద్ధి పనులు ఏమైనా జరిగితే కాంట్రాక్టులు చేసుకుందామని భావించిన వారు కూడా నిరాశకు గురవుతూ.. లోలోపల నిరసన వ్యక్తం చేస్తున్నారట. తమ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారట. అయితే.. ఇప్పటికిప్పుడు చేయడానికి ఏమీ లేదని మౌనంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతోంది. విపక్షం బలంగా లేకపోవడంతో ఏమీ చేయలేక సైలెంట్ గా బండి లాగిస్తున్నారని అంటున్నారు. మరి, ఇది ఎన్నికల నాటికి ఏవైపుగా టర్న్ తీసుకుంటుందో చూడాలని అంటున్నారు.