Tamarind Tree : పచ్చి చింతకాయ ఎలా ఉంటుంది? పైన చూడ్డానికి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. తుంచితే.. లోపల తెల్లగా ఉంటుంది. ఇది సాధారణం. చింతకాయ ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. కానీ.. ఇప్పుడు చెప్పుకుంటున్న చింతకాయ మాత్రం విచిత్రంగా ఉంటుంది. పైన ఆకుపచ్చగానే ఉన్నప్పటికీ.. తుంచితే లోపల ఎర్రగా ఉంటుంది. అంతేకాదు.. దాని వాసన కూడా రక్తపు వాసనే వస్తుంది! ఇదేంటని అడిగితే.. అది మనుషుల రక్తం అనిచెబుతారు స్థానికులు! మరి, ఈ చింత చెట్టు ఎక్కడ ఉంది? మనిషి రక్తానికీ, ఈ చింతకాయకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది చూద్దాం.
ఈ చింత చెట్టు నల్లమల అడవుల్లో ఉంది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం అనే గ్రామంలో ఈ చెట్టు ఉంది. నల్లమల అడవుల్లోని ఓ మారుమూల గ్రామం ఇది. అయితే.. చూడ్డానికి ఇది మారుమూల చిన్న గ్రామమే అయినప్పటికీ.. ఇక్కడ ఆలయాలకు మాత్రం కొదవలేదు. ఈ ఊరి చుట్టూ ఓ పెద్ద గుట్ట ఉంది. ఆ గుట్టపై వెంకటేశ్వరుడు, లక్ష్మీ నరసింహుడి ఆలయాలు ఉన్నాయి. అదేవిధంగా.. లక్ష్మీదేవి ఆలయం, భగీరథుడు, ఓంకారేశ్వరుడి ఆలయాలు కూడా ఉన్నాయి. వీటికి సమీపంలో మరో మైసమ్మ గుడి ఉంది. ఈ గుడి పక్కనే ఉన్నది మనం చెప్పుకునే చింత చెట్టు.
ఈ చింత చెట్టు చుట్టూ ముస్లింల సమాధులు ఉన్నాయి. ఈ చెట్టు కాయలు ఎర్రగా రక్తం మాదిరిగా ఉండడానికి ఆ సమాధులకు సంబంధం ఉందని చెబుతారు స్థానికులు. అదేంటీ అని అడిగితే.. ఓ కథ చెబుతారు. కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడి పాలనలో ధనాన్ని నల్లమల అడవుల్లో దాచేవారట. శత్రు సైన్యాలకు దొరకకుండా ఇలా జాగ్రత్త చేసేవారట. మైలారం గ్రామంలోని మైసమ్మ గుడి వద్ద కూడా ధనం, నగలు దాచేవారట.
వీటిని కాపాడేందుకు ముస్లింలను కాపలాగా ఉంచేవారట. అయితే.. ఒకరోజు కొందరు దుండగులు వచ్చి కాపలా ఉన్న ముస్లింలను చంపేసి, ఖజానా మొత్తం ఎత్తుకుపోయారట. భోజనం చేస్తున్న ముస్లింలపై దాడిచేసి రక్తపాతం సృష్టించారట. ఆ రక్తంలో తడిసిన చింత గింజ మొలకెత్తిందని, అదే ఇప్పుడు ఇలా ఎరుపు రంగు కాయలను కాస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఆ కాయలు తుంచితే ఎర్రగా కనిపిస్తాయని, వాసన కూడా రక్తంలాగా వస్తుందని అంటారు.
ఈ గ్రామంలో పదుల సంఖ్యలో చింత చెట్లు ఉన్నాయి. అవన్నీ సాధారణ కాయలనే కాస్తున్నాయి. వాటిని స్థానికులు తింటారు కూడా. కానీ.. ఈ ఒక్క చెట్టు మాత్రమే ఇలా వింతగా కాయలు కాస్తోంది. దీనికి పై కథను కారణంగా చెబుతుంటారు స్థానికులు. అయితే.. శాస్త్రీయంగా కారణమేంటన్నది నిపుణులు మాత్రమే తేల్చగలరని పలువురు చెబుతున్నారు. జన్యులోపం కారణంగా ఇలాంటి కాయలు కాస్తాయని అంటున్నారు.