అఫ్గానిస్థాన్(Afghanistan) లో తాలిబన్లు(Taliban) రెచ్చిపోతున్నారు. దీంతో ప్రభుత్వ సైనికులు, పోలీసులు ఎదుర్కోలేకపోతున్నారు. తాలిబన్ల ఆగడాలకు హద్దు లేకుండా పోతోందని వార్తలు వస్తున్నాయి. సైనికులు ఆయుధాలు, వాహనాలు వదిలేసి పారిపోతున్నట్లు తెలుస్తోంది. సైనికులు తాలిబన్లతో చేరిపోవడంతో పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. అమెరికా నుంచి శిక్షణ పొందిన వారు సైతం తాలిబన్ల దాడిని తట్టుకోలేకపోతున్నారు. దీంతో తాలిబన్లు వాహనాల్లో చక్కర్లు కొడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అక్కడి ప్రజలు వాపోతున్నారు. పలు ప్రాంతాల్లో సరా ఖేటా అనే ప్రత్యేక దళం నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం.
సరా ఖేటా అంటే పష్తో భాషలో అరుణ దళం అని అర్థం. ఇస్లామిక్ స్టేట్ మీద పోరాడటానికి 2015 అక్టోబర్ లో సాధారణ తాలిబన్లలోనే మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. వీరికి శిక్షణ, ఆయుధాలు అందజేశారు. అరుణ దళ ఫైటర్లు అమెరికన్ తయారీ ఎం4 కార్బైన్ తుపాకీ, రష్యా ఉత్పత్తి చేసిన ఏకే శ్రేణి రైఫిళ్లు, తోకరెవ్ పిస్తోళ్లు, లేజర్ పాయింటర్లను వాడుతున్నారు. తలకు ఎర్రటి పట్టీలు, కాళ్లకు పాకిస్తాన్ తయారీ చీతా బూట్లు, మోచేతులు, మోకాళ్లు రక్కుపోకుండా రక్షణ ప్యాడ్లు, చాతీ కవచాలు, చేతులకు గ్లౌజులు ధరిస్తారు. సాధారణ తాలిబన్లకన్నా విలక్షణంగా కనిపిస్తారు.
ఏదైనా పట్టణంపై దాడి చేయాలంటే ముందు అరుణ దళ కమెండోలు రంగంలకి దిగి ప్రత్యర్థి పక్షంలో కీలక వ్యక్తులను మాటువేసి చంపుతారు. తరువాత తాలిబన్ పటాలాలు దూసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుంటాయి. తాలిబన్ల దాడులకు మార్గం సుగమం చేసే అరుణదళం ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాలిబన్లు తమకు పరిచయమున్న ప్రాంతాలలోనే దాడులకు తెగబడతారు. అరుణదళం మాత్రం ఎక్కడికైనా వెళ్లి విధ్వంసం చేస్తారు.
అరుణదళం వేగంగా వెళ్లడానికి అవసరమైన వాహనాలు తమ వద్ద ఉంచుకుంటాయి. మొదట్లో వందల్లో ఉన్న అరుణదళ సిబ్బంది సంఖ్య నేడు వేలుగా మారింది. అఫ్గాన్ లోని సంగర్హర్, హెల్మాండ్, ఫరా ప్రాంతాల్లో ఐఎస్ ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. వారిని తాలిబన్ -హక్కానీ నెట్ వర్క్ – అల్ ఖైదా కూటమి అక్కడి నుంచి తరిమేసింది. తరువాత తాలిబన్ అరుణదళం తన దృష్టిని అఫ్గాన్ పోలీసులు, సైన్యం, అమెరికా గూఢచారుల వదద్ శిక్షణ పొందిన అఫ్గాన్ ప్రత్యేక దళాలపైకి మళ్లించింది. సరా ఖేటా దళం మొదటిసారిగా 2016లో హెల్మండ్ రాష్ర్టంలోని సాంగిన్ లో పోరుకు దించారు.