
తెలంగాణలో కుంభవృష్టి కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి 33 ఏళ్ల వర్షం రికార్డు బద్దలైంది. ఇదేం వాన అంటూ తెలంగాణ ప్రజలు నెత్తినోరు కొట్టుకున్నారు. రోజంతా పడిన వానకు హైదరాబాద్ జలమయమైంది. చాలా కాలనీలు, ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. పాతబస్తీలో రెండు ఇళ్లు కూలి 9మంది మరణించారు.
Also Read: తెలంగాణ సాగుకు కేసీఆర్ కొత్త ఒరవడి
గత 33 ఏళ్లలోనే తెలంగాణలో కనివినీ ఎరుగని వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున నుంచి మొదలైన వాన అర్ధరాత్రి దాటినా కుండపోతగా కురుస్తూనే ఉంది. హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ వర్షం ముఖ్యంగా హైదరాబాద్ నగర జీవనాన్ని అస్తవ్యస్త్యం చేసిందని తెలిపింది. హైదరాబాద్ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని భిక్కుభిక్కుమంటూ రాత్రంతా గడిపారు.
వానగండం పొంచి ఉండడంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని 17 జిల్లాల్లో వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలెర్ట్ ప్రకటించింది. 1988లో తెలంగాణలో 83.2 సెం.మీల వర్షపాతం నమోదు కాగా.. తాజాగా ఈ సంవత్సరం 110.2 సెం.మీల వర్షం తెలంగాణలో కురిసింది. దీంతో రికార్డు బద్లలైంది. 2002లో హైదరాబాద్ లో 23 సెం.మీల వర్షపాతం నమోదైంది.
Also Read: అవమానమే పెనుభారమై.. కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
ఈ క్రమంలోనే హైదరాబాద్ లో నాలాలు, డ్రైనేజీలు, మూసీ నది పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కమిషనర్ తెలిపారు.
తీవ్ర వాయుగుండంతో ఉపరితల ధ్రోణి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్తున్నట్టు వాతావరణం కేంద్రం తెలిపింది. అందువల్లే హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. రాబోయే మూడు రోజుల పాటు హైదరాబాద్ తోపాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.