Yadadri Temple: దేవుడంటే అందరికీ ఒకటే. చేసే పూజలో తేడా ఉండొచ్చు. కొలిచే కొలుపు మాత్రం ఒకటే. అలాంటి దేవుడు ఇచ్చే దర్శనం మాత్రం ఒకే విధంగా ఉండదు. ఖద్దరు చొక్కాలు వేసుకునే వాళ్ళకి, సిరి సంపదలతో తులతూగే వారికి దేవుడి దర్శన భాగ్యం వేరే విధంగా ఉంటుంది. ఉదాహరణకు తిరుపతి చూడండి విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది. అదే సామాన్యుడికి మాత్రం సెకండ్ల పాటు కూడా శ్రీవారిని చూసే అవకాశం ఉండదు. మనీ ఉంటే ఏ పనైనా జరుగుతుంది అంటారు. కానీ దానిని మనీ ఉంటే దేవుడైన మన ముందుకు వస్తాడు అని మార్చుకోవాలి. ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి అధికారం అర్హత కూడా చేరింది. వైల్డ్ కార్డు ఎంట్రీ లాగా.. అధికార పార్టీ నాయకులు సిఫారసు చేస్తే దేవుడి దర్శనం ఏం ఖర్మ అంతకుమించి అనేలాగా జరిగిపోతున్నాయి.. తాజాగా ముఖ్యమైన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన కొంతమంది తన అధికార దర్పాన్ని ఏ విధంగా ఉపయోగించారో.. దేవుడి గుట్టమీద ఎలా హవా కొనసాగించారో చూస్తే కళ్ళు బైర్లు కమ్మడం గ్యారెంటీ.
ఇష్టా రాజ్యం
యాదగిరి నరసన్న కాస్త యాదాద్రి నరసింహుడిగా మారిపోయాడు. ఏలుతున్న ప్రభువులకు ఏది నచ్చితే అది చేయడంతో ఆ క్షేత్రం కాస్త స్థిరాస్తి వ్యాపారానికి నెలవుగా మారిపోయింది. అక్కడ ప్రతిష్టించిన స్తంభాలకు కారు గుర్తులు, ఇంకా బంగారు తెలంగాణ పథకాలకు సంబంధించిన ప్రతిబింబాలు యాదృచ్ఛికంగా ఒదిగిపోయాయి. ఇదేంటని ప్రశ్నిస్తే బంగారు తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర పడిపోయింది. ఇక యాదాద్రి క్షేత్ర జీర్ణోద్దరణ తర్వాత అధికార పార్టీ రాజకీయం అందులో మరింత చిక్కగా ఇమిడిపోయింది. దానిని అడ్డుకునే వారు లేరు. ఆపేవారు అంతకన్నా లేరు. చేసే పనిలో నిజాయితీ ఎలాగూ లేదు కాబట్టి.. ఒక మోస్తరు వర్షం కురిసినా నీళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఒకచోట గొప్పగా కట్టిన గుడి కురుస్తూనే ఉంది. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే అధికార పక్షం నుంచి వారిపై విమర్శల వాన కురుస్తూనే ఉంది. మొత్తానికి యాదగిరిగుట్ట కాస్త యాదాద్రి అయిపోయింది. ఏలుతున్న ప్రభువులకు ఇష్టా రాజ్యం అయిపోయింది..
ముఖ్యమైన మంత్రి ఇలాకా కాబట్టి..
ఇక యాదగిరి క్షేత్రంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు అంతకుమించి అనేలాగా పెరిగిపోతున్నాయి. సిఫారసు దర్శనాలు సర్వసాధారణం అయిపోయాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సొంత నియోజకవర్గంలో 1000 మంది దాకా యాదాద్రి దర్శనానికి వచ్చారు. ఇది పైకి చూస్తే సాధారణమే అనిపించవచ్చు. కానీ రానున్నది ఎన్నికల పండుగ కాబట్టి, అక్కడ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి కాబట్టి.. తమ నాయకుడు అమెరికాలో ఉన్నాడు కాబట్టి.. ఆయన మెప్పు పొందేందుకు అనుచర గణం ఏకంగా తమ నియోజకవర్గం నుంచి వెయ్యి మందిని యాదాద్రి తీసుకొచ్చింది. ఈ వెయ్యి మందికి కూడా ఉచిత దర్శనం కల్పించారు. ఉచిత దర్శనం అంటే సామాన్య భక్తుల్లాగా కాకుండా.. 150 రూపాయల టోకెన్ దర్శనాన్ని ఫ్రీగా చేశారు. అదే కాదు కొండపైకి వారు వచ్చిన బస్సులను అనుమతించారు. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధం. కానీ వాటిని అడిగే వారెవరూ.. పట్టించుకునే వారెవరూ.. అధికారం ఉంది. వారికి భయపడే అధికార గణం ఉంది. అలాంటప్పుడు వారికి అడ్డేముంది. ఇలాంటప్పుడు సామాన్యుల భక్తుల సంగతి ఏంటనే ప్రశ్నిస్తే.. వారికి ఓటు వేసేందుకు మాత్రమే పనికి వస్తారు. అంతే అంతకుమించి ఏమీ లేదు.