AP Government- Sarpanches: ‘అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తినా తిననివ్వదు’ ఏపీలో సర్పంచ్ ల పరిస్థితి ఇది. గత ఎన్నికల్లో ప్రత్యర్థులను ఓడించేందుకు చాలా ఖర్చు పెట్టారు. ఎలాగోలా గెలిచిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. వీధిలైట్లు లేవని స్థానికులు ఫిర్యాదుచేస్తుంటే పనులు చేయలేని స్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోగా.. కేంద్రం అందించే ఆర్థిక నిధులను సైతం విద్యుత్ బకాయిల కింద తీసేసుకుంది. దీంతో పంచాయతీ ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. విశేషమేమిటంటే తన సొంత పార్టీ సర్పంచ్ లకు కూడా సమాచారం ఇవ్వకుండానే ఆర్థిక సంఘ నిధులు మాయం చేయడంతో వారు లబోదిబోమంటున్నారు. తమ ప్రభుత్వమే కదా నిధులు పుష్కలంగా విడుదలవుతాయి. ఆ పై కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక నిధులతో పంచాయతీని అభివృద్ధి చేయాలని తలచిన గ్రామ పాలకుల పరిస్థితి ఇప్పుడు తారుమారైంది. అటు ఆర్థిక కష్టాలతో పాటు ప్రజల్లో చులకనైపోయామన్న బాధ వారిని వెంటాడుతోంది.

వైసీపీ ఆవిర్భావం నుంచి కష్టపడ్డారు. విపక్షంలో ఉన్నప్పుడు సైతం ఇబ్బందులు పడ్డారు. అయినా గట్టిగానే పోరాడారు. వారి పోరాటానికి తగిన ప్రతిఫలం లభించింది. పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో తమకు తిరుగులేదని అనుకున్నారు. సర్పంచ్ లుగా మారి గ్రామాన్ని ఉద్దరించాలని భావించారు. అయితే గ్రామం అన్నాక ప్రత్యర్థులు ఉంటారు. సొంత పార్టీలోనే తిరుగుబాటుదారులు ఉంటారు. వాటన్నింటినీ అధిగమించినా అధిష్టానం కొడుతున్న జెల్లతో ఇప్పుడు వారికి తత్వం బోధపడుతోంది. అటుచేసిన పనులకు బిల్లులు రాక.. ఇటు పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో వారిలో ఆగ్రహం పెల్లుబికుతోంది. సొంత పార్టీ, ప్రభుత్వంపైనే వారు పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపాలని భావిస్తున్నారు.

ఏకగ్రీవ పంచాయతీల్లో పరిస్థితిమరింత విడ్డూరంగా మారింది. పార్టీ అధికారంలో ఉంది కదా.. అదే పార్టీకి చెందిన నాయకుడికి ఏకగ్రీవం ఇస్తే పోలే అంటూ అప్పట్టో ఇనానమస్ గా చాలామందిని ఎన్నుకున్నారు. దీంతో రూ.20 లక్షల నజరానా వస్తుంది కదా అని అంతా భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం రూపాయి విడుదల చేయలేదు. ఏ ప్రజలైతే ఏకగ్రీవంగా పదవిని కట్టబెట్టారో వారి నుంచే ఇప్పుడు ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు ఏకగ్రీవ నజరానా వస్తుందని భావించిన చాలా మంది సర్పంచ్ పదవిని వేలం పాటలో కైవసం చేసుకున్నారు. అప్పట్లో భారీ మొత్తం ముట్టజెప్పి పదవిని అందుకున్నారు. అటువంటి వారంతా ఆర్థికంగా నష్టపోయి నడివీధిన పడ్డారు. సచివాలయం, రైతుభరోసా కేంద్రం వంటి భవనాలకు పెట్టుబడులు పెట్టి చేతులు కాల్చుకున్న వారు సైతం ఉన్నారు. ప్రజలకు పప్పూ బెల్లంలా పంచడానికి డబ్బులున్నాయి కానీ.. తమకు చెల్లించడానికే లేవా అంటూ తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష సర్పంచ్ లు ఆందోళన చేపట్టారు. ఇప్పుడు అధికార పార్టీ వారు సైతం రోడ్డెక్కేందుకు సిద్ధపడుతున్నారు.