Revanth Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై ఆ పార్టీలోని సీనియర్లు మరోసారి తిరుగుబాటు స్వరం పెంచారు. ఇప్పటికే రేవంత్‌రెడ్డిపై గుర్రుగా ఉన్న పార్టీ సీనియర్ నేతలు తమ అసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానం వద్ద వెళ్లగక్కారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో పలువురు నేతలు సమావేశమై రేవంత్‌రెడ్డి ఒంటెద్దు పోకడలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రేవంత్ ‘వన్‌మ్యాన్ షో’ చేస్తున్నాడని, పార్టీ నేతలెవరితో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటూ సీనియర్లను అవమానిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఆయన తీరుతో పలువురు కీలక నేతలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉన్నదని తెలిపారు.

తాజాగా పీసీసీ కమిటీల ప్రకటనతో..
తాజాగా కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ కమిటీలను ప్రకటించింది. దీనిపై ఆ పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీల్లో రేవంత్ వర్గానికే కీలక పదవులు దక్కాయని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అయితే.. కమిటీల ప్రకటనకు ముందు తనను కూడా సంప్రదించలేదని పేర్కొన్నారు. కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, విష్ణువర్ధన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి బహిరంగంగానే అధిష్టానం తీరుపై మీడియాకు ఎక్కారు. ఈ క్రమంలో సీనియర్లంతా భేటీ కావాలని నిర్ణయించారు.
భట్టి ఇంట్లో భేటీ..
పీసీసీ కమిటీలపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలంతా సీఎల్పీ నేత భట్టి ఇంట్లో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా
రేవంత్ రెడ్డిపై సీఎల్పీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోందని పరోక్షంగా ఆరోపించారు. సేవ్ కాంగ్రెస్ పేరుతో ముందుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని మనస్తాపానికి గురువుతున్నాని తెలిపారు. సీనియర్ కమిటీ కూర్పులో నన్ను ఎవరు సంప్రదించలేదన్నారు. మిమ్మల్ని సంప్రదించకుండా కమిటీలు ఎలా వేశారని సీనియర్ నేతలు నన్ను అడుగుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీనియర్ నేతలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నర నుంచి సొంత పార్టీ నేతలపైనే పోస్టులు పెట్టి బలహీనపరిచే కుట్ర జరుగుతోందన్నారు. కమిటీల్లోని మెజారిటీ నేతలు వలస వచ్చిన వారేనని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ భేటీలో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మధుయాష్కీ ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

తాజా తిరుగుబాటుతో చిక్కులు తప్పవా..
తాజాగా సీనియర్ల తిరుగుబాటుతో రేవంత్‌కు చిక్కులు తప్పవన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ కోసం ఏళ్లుగా కష్టపడుతున్నవారిని కాదని, రేవంత్ కేవలం తనవెంట కాంగ్రెస్‌లో చేరినవారికే పదవులు ఇప్పించుకున్నారన్న భావన ఆ పార్టీ సీనియర్లలో ఉంది. దీంతో రేంవత్ వన్‌మ్యాన్‌షోకు తమ నిరసన ద్వారా చెక్‌పెట్టాలని భావిస్తున్నారు. భట్టి ఇంట్లో సమావేశం అనంతరం తీసుకునే నిర్ణయాలతో అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని కూడా భావిస్తున్నారు. అయినా అధిష్టానంలో మార్పు రాని పక్షంలో ఎవరి దారి వాళ్లు చూసుకుంటామని అల్టిమేటం ఇవ్వనున్నట్లు తెలిసింది. మరి తాజా తిరుగబాటు టీకప్పులో తుపానులా మారుతుందో.. లేక నిజమైన తుపానులా రేవంత్‌కు చెక్‌పెడుతుందో చూడాలి.