
మంత్రి ఈటల రాజేందర్ పై కబ్జా ఆరోపణలు రావడమే ఆలస్యం.. వెంటనే విచారణకు ఆదేశించారు. అధికారులు కూడా వెంటనే నివేదికను సమర్పించారు. మంత్రి శాఖను కూడా బదలాయించడం జరిగిపోయాయి. అయితే.. మిగిలిన వారి సంగతేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టీఆర్ఎస్ లో ఎంతో మంది ప్రజాప్రతినిధులు కబ్జాలు చేసినట్టుగా.. చాలా కాలంగా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మంత్రి మల్లారెడ్డి కబ్జా వ్యవహారం కోర్టు వరకూ వెళ్లడం గమనార్హం. కోర్టు కేసులు పెట్టాలని ఆదేశిస్తే.. అప్పుడు కేసులు పెట్టారు తప్ప, విచారణ ఎంత వరకు వెళ్లిందన్న సంగతి ఎవ్వరికీ తెలియదు.
మల్లారెడ్డి మాత్రమే కాకుండా.. ఎంతో మంది మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కబ్జా ఆరోపణలు ఉన్నాయి. జనగామలో ప్రజలు ఉద్యమమే నిర్వహించారు. ఇంకా చాలా చోట్ల ఆందోళనలు కొనసాగాయి. కానీ.. వాటి గురించి ముఖ్యమంత్రి పట్టించుకున్న దాఖలాల్లేవు. అలాంటిది.. కేబినెట్ మినిస్టర్ పై ఆరోపణలు రావడం.. సీఎం స్పందించడం.. అధికారులు విచారణ చేయడం.. శాఖను బదలాయించడం అన్నీ గంటల్లోనే జరిగిపోయాయి.
మరి, మిగిలిన వాటి విషయంలోనూ ఇదే పని చేస్తే బాగుంటుంది కదా సారూ.. అని అడుగుతున్నారు రాష్ట్రంలోని అధికార పార్టీ నేతల బాధితులు. ప్రతిపక్షాలు సైతం ఇదే డిమాండ్ వినిపిస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డి సహా.. మిగిలిన వారిపైనా విచారణ జరిపించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, సీఎం ఏమంటారో..?