Telangana MLC candidates: తెలంగాణలో రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నాయి. హుజూరాబాద్ ఎన్నికల తరువాత రాజకీయ సమీకరణలు ఎవరికీ అంతుబట్టడం లేదు. సిద్ధిపేట కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి రాజీనామా చేస్తారని ఎవరూ ఊహించలేదు. అలాగే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌కు ఎమ్మెల్సీ కట్టబెడుతారని కూడా ఎవరూ అంచనా వేయలేకపోయారు.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్లో చిగురించాయి. ఇప్పటికైనా తమకు భాగ్యం దక్కపోతుందా అని అందరూ అనుకున్నారు. కానీ కేవలం 6 స్థానాలు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉండటంతో మిగితావారు నిరాశకు గురయ్యారు. టీఆర్ఎస్ నిన్న విడుదల చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ మంత్రి వర్గంలో కచ్చితంగా మార్పులు ఉంటాయని చెబుతోంది. ఎందుకంటే ఇందులో ఎవరూ ఊహించని అభ్యర్థుల పేర్లు కనిపించాయి. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్‌కు ఎమ్మెల్సీ ఇవ్వనున్నారు. అలాగే ఇక కౌశిక్ రెడ్డిని పక్కన పెడుతారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆయనకు ఇందులో చోటు కల్పించారు. అలాగే అనుకోని విధంగా తన ఉద్యోగానికి రాజీనామ చేసిన కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి కూడా ఇందులో స్థానం కల్పించారు. కడియం శ్రీహరిని కూడా ఇందులో చేర్చారు. అయితే ఇందులో కావాలనే ఆయా సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేశారని తెలుస్తోంది. బండ ప్రకాశ్‌కు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి ఆర్థిక శాఖ అప్పజెపుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ వద్ద ఉంది. హరీశ్ రావును కేవలం వైద్య, ఆరోగ్యశాఖకు పరిమితం చేసి, ఆర్థిక శాఖను ఆయన నుంచి తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.
ఈటెల రాజేందర్ రాజీనామాతో మంత్రి వర్గంలో బీసీ సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడు వెళ్లిపోయాడు. దీంతో బీసీల్లో, ముఖ్యంగా ముదిరాజ్ కులస్తుల్లో టీఆర్ఎస్ పట్ల కొంత అంసంతృప్తి ఏర్పడింది. అందుకే బండ ప్రకాశ్‌ను మంత్రిని చేస్తారని తెలుస్తోంది. ఆయన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకుడు కావడంతోనే ఆయనకు మంత్రి పదవి ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది.
Also Read: Telangana: తెలంగాణ గుండె చప్పుడుకు ఆంధ్రా నాయకత్వం..
స్థానిక సంస్థల కోటాలో మరి కొందరికి ఛాన్స్..
ఈ ఎన్నికల్లో నిరాశకు గురైన టీఆర్ఎస్ నాయకులకు వచ్చే స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వనున్నారు. అయితే ఇందులో జిల్లా స్థాయి నాయకులకే అవకాశం దక్కనుంది. ఆ ఎన్నికలు కూడా పూర్తయిన తరువాత మంత్రి వర్గంలో మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో కొత్త వారికి కూడా అవకాశం కల్పించనున్నారు. అయితే కొత్త మంత్రి వర్గంలో ఎవరికి ఛాన్స్ వస్తుందో అనే విషయం క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు.
Also Read: KCR: కేంద్రప్రభుత్వాన్ని వదలా..18న మహాధర్నా.. కేసీఆర్ సంచలనం