RBI 2000 Note Withdraws: 2016 నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధానమంత్రి ప్రకటించారు.. రాత్రిపూట ప్రధాని ఆ ప్రకటన చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. ఇప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు అదే నిర్ణయాన్ని ప్రకటించింది. ఈసారి 2000 నోటుకు ఎసరు వచ్చింది. క్లీన్ నోట పాలసీ పేరుతో ప్రస్తుతం సర్కులేషన్ లో ఉన్న పెద్ద నోటుకు రిజర్వ్ బ్యాంక్ టాటా చెప్పేసింది. ఆరున్నర సంవత్సరాల క్రితం ఎవరూ ఊహించని విధంగా ముందుకు వచ్చిన 2000 నోటు అంతే ఆశ్చర్యకరంగా ఇప్పుడు కనుమరుగయిపోయింది. రిజర్వ్ బ్యాంకు ఏం చెప్పి దీన్ని సమర్థించుకున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఇంకేం చెప్పి దీన్ని వెనకేసుకొచ్చినప్పటికీ..ఇప్పుడు సామాన్యుడికి, సగటు మనిషికి ఈ కష్టం అని చెప్పక తప్పదు.
ఆగమాగం
2016 నవంబర్ 8న పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఒక్కసారిగా చుట్టుముట్టిన కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కెందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోటును ఆగమాగంగా తెరపైకి తీసుకువచ్చింది. అప్పట్లో ఈ నోటును ఎలాగోలా అందుకున్నామన్న ఆనందం ఒకవైపు.. దాన్ని ఎలా మార్చుకోవాలో తెలియక పడే ఆవేదన మరోవైపు ఉన్నదంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి నోటును ఇప్పుడు ఆర్బిఐ అలవోకగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అవసరం కోసమే ఈ పెద్ద నోటును తీసుకొచ్చామని ఆర్బిఐ అప్పట్లో ప్రకటించడం విశేషం.
ముద్రణకు 1190 కోట్లు
నల్లధనాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2001 ఆరున్నర సంవత్సరాల తర్వాత రద్దు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ నోటు కోసం ఖర్చు చేసిన వేలకోట్ల ప్రజాధనం బూడిదపాలైంది. ఒక్క నోట్ ప్రింట్ చేసేందుకు 3.54 రూపాయలు ఖర్చవుతుంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న 336.3 కోట్ల 2000 నోట్ల కోసం 1190 కోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖర్చు చేసింది. ప్రస్తుతం ఈ నోటును వెనక్కి తీసుకోవడంతో వెయ్యి కోట్లకు పైగా ప్రజా ధనం బూడిదలో పోసిన పన్నీరు అయింది. రద్దు చేసిన వెయ్యి రూపాయల నోటును ప్రింటింగ్ చేసేందుకు అయ్యే ఖర్చు 3.54 రూపాయలు కాగా.. 2000 నోటు ప్రింటింగ్ కోసం అయ్యే ఖర్చు 4.18 రూపాయలు. అంటే 64 పైసలు అధికం. పది రూపాయల నోటు ప్రింటింగ్ చేసేందుకు 1.01, 20 రూపాయల నోటు కోసం రూపాయి, 50 రూపాయల నోటు కోసం 1.01 ఖర్చు చేస్తోంది రిజర్వ్ బ్యాంక్.
తొలిసారిగా పరిచయం
2016లో తొలిసారి దేశ చరిత్రలో 2000 నోటు పరిచయం అయింది. చలామణి లోకి వచ్చిన 2000 నోట్లలో దాదాపు 89 % 2017 మార్చ్ కు ముందు విడుదలైనవే. 2018 మార్చి 31న దేశంలో 2000 నోట్ల విలువ గరిష్టంగా 6.73 లక్షల కోట్లు. ఈ ఏడాది మార్చి చివరికల్లా 3.62 లక్షల కోట్లకు పరిమితమైంది. మొత్తం నోట్లలో వీటి వాటా 10.8%. ఇక 2018_19 నుంచే 2000 నోటు ముద్రణను ఆర్బిఐ నిలిపివేసింది. ఈనెల 23 నుంచి బ్యాంకుల్లో, ఆర్బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో 2000 నోట్ల మార్పిడి చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30 దాకా మాత్రమే ఈ గడువు ఉంది…ఇక నిరుడు డిసెంబర్ నాటికి దేశంలో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 32.5 లక్షల కోట్లు. 2017 మార్చి 31 నాటికి 2000, 500 నోట్ల విలువ 9.512 లక్షల కోట్లుగా తేలింది. అవే నోట్ల విలువ 2022 మార్చి చివరి నాటికి 22.057 లక్షల కోట్లకు చేరుకుంది. 2020 మార్చినాటికి 274 కోట్ల 2000 నోట్లు ఉన్నాయి. 2022 మార్చి 4,554.68 కోట్లకు 500 నోట్లు పెరిగాయి. మొత్తం చెలామణి లో 500 నోట్ల వాటా 34.9 శాతం.