TV9 Ravi Prakash : పగతో రగిలిపోతున్న రవి ప్రకాష్.. మేఘా తేనె తుట్టెను కదిపాడు.. ప్రభుత్వాలు దృష్టి సారిస్తే పెను సంచలనం..

టీవీ9 ను టేక్ ఓవర్ చేసిన కంపెనీలైన మెఘా, మై హోమ్ పై రవి ప్రకాష్ కక్ష కట్టాడు. తన యూట్యూబ్ ఛానల్ ఆర్ టీవీ ద్వారా సంచలన విషయాలను వెలుగులోకి తేవడం ప్రారంభించాడు. అయితే ఇందులో ఇటీవల రవి ప్రకాష్ వెలువరించిన ఒక నిజం మాత్రం సంచలనంగా మారింది. మెఘా కంపెనీ తేనె తుట్టెను అతడు కదిలించడం ప్రకంపనలు సృష్టిస్తోంది.

Written By: Bhaskar, Updated On : July 15, 2024 5:10 pm
Follow us on

TV9 Ravi Prakash  :  రవి ప్రకాష్.. తెలుగు జర్నలిజానికి పరిచయం అక్కరలేని పేరు. తేజ ఛానలో బ్యూరో చీఫ్ నుంచి నేరుగా టీవీ9 పేరుతో టీవీ ఛానల్ ప్రారంభించాడు. 24 గంటల పాటు న్యూస్ అందిస్తామని అప్పట్లో సంచలనం సృష్టించాడు. అతడు చెప్పినట్టుగానే టీవీ9 అనేక సంచలనాలకు వేదికయింది. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా లో సరికొత్త ప్రయోగంగా నిలిచింది. టీవీ9 వేసిన బాటలో అనేక న్యూస్ చానల్స్ పుట్టుకొచ్చాయి. కొన్ని మగలో పుట్టి పుబలో ముగిసిపోతే.. మరికొన్ని టీవీ9 కే చాలెంజ్ విసిరాయి. అలా టీవీ9 దినదిన ప్రవర్ధమానంగా ఎదిగింది. దేశంలోనే అతిపెద్ద న్యూస్ నెట్వర్క్ గా అవతరించింది. ఇదే సమయంలో రవి ప్రకాష్ వేసిన అడుగులు తడబడ్డాయి. ఫలితంగా టీవీ 9 నుంచి అతడు వైదొలగాల్సి వచ్చింది. టీవీ9 మెఘా, మై హోమ్ గ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దీనిపై రవి ప్రకాష్ పోరాటం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. దీంతో అప్పటినుంచి రవి ప్రకాష్ పగతో రగిలిపోతున్నాడు. టీవీ9 చేతులు మారడం వెనక అప్పట్లో ఓ ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి అయిన ఆయన కుమారుడు తెర వెనుక చక్రం తిప్పినట్టు తెలుస్తోంది.

అప్పటి నుంచి పగ

టీవీ9 ను టేక్ ఓవర్ చేసిన కంపెనీలైన మెఘా, మై హోమ్ పై రవి ప్రకాష్ కక్ష కట్టాడు. తన యూట్యూబ్ ఛానల్ ఆర్ టీవీ ద్వారా సంచలన విషయాలను వెలుగులోకి తేవడం ప్రారంభించాడు. అయితే ఇందులో ఇటీవల రవి ప్రకాష్ వెలువరించిన ఒక నిజం మాత్రం సంచలనంగా మారింది. మెఘా కంపెనీ తేనె తుట్టెను అతడు కదిలించడం ప్రకంపనలు సృష్టిస్తోంది.

గత ప్రభుత్వాలకు..

తెలుగు రాష్ట్రాలలో గతంలో అధికారంలో ఉన్న పార్టీలకు మెఘా కంపెనీ పెద్దలు అత్యంత ఇష్టమైన వాళ్ళుగా ఉండేవారు. అప్పట్లో ఆ ప్రభుత్వాలు చేపట్టిన కీలక ప్రాజెక్టుల నిర్మాణ బాధ్యతను మెఘా దక్కించుకుంది. అయితే అప్పట్లో పనులు చేయకపోయినప్పటికీ ఆ కంపెనీ వేలకోట్ల బిల్లులు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆ కంపెనీ కొన్ని నిబంధనలను పాటించేందుకు అక్రమాలకు పాల్పడిందని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక కాంట్రాక్ట్ దక్కించుకున్న కంపెనీ ప్రతి ప్రాజెక్టులోని దాని విలువలో 10 శాతం బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలి. అయితే ఈ నిబంధనను మెఘా కూడా పాటించింది.. ప్రభుత్వానికి బ్యాంకు గ్యారంటీ సమర్పించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మెఘా సమర్పించిన బ్యాంకు గ్యారంటీ లపై రవి ప్రకాష్ స్థూల శోధన చేయగా సంచలన విషయాలు వెలుగు చూశాయి.

ఎన్నో బ్యాంకులు ఉండగా..

మన దేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొదలు పెడితే బ్యాంక్ ఆఫ్ బరోడా వరకు ఎన్నో బ్యాంకులున్నాయి. హెచ్ డీ ఎఫ్ సీ నుంచి మొదలు పెడితే ఐసీఐసీఐ వరకు కూడా ఎన్నో ప్రైవేట్ బ్యాంకులున్నాయి. వీటన్నిటిని కాదని మెఘా కంపెనీ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే బ్యాంకు ధరావత్ (గ్యారెంటీ) సమర్పించింది. ఆ బ్యాంకులో మెఘా కంపెనీకి ఎటువంటి డిపాజిట్లు లేవు. వాస్తవానికి ఆ బ్యాంక్ అనేది పెద్ద ఫ్రాడ్ అని తెలుస్తోంది. దానికి కార్యకలాపాలు కూడా పెద్దగా లేవు. ఆ బ్యాంకు వెస్టిండీస్ లోని ఓ చిన్న దీవి అయినటువంటి సెయింట్ లూసియాలో ఉంది. తప్పుడు గ్యారంటీలు ఇచ్చి కమీషన్లు తీసుకోవడమే ఆ బ్యాంకు పని అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ బ్యాంకు కి సంబంధించిన ప్రతినిధి హైదరాబాదులో ఉంటారట. కానీ ఆ బ్యాంకు శాఖ మాత్రం ఇక్కడ లేదు.

ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయా?

మెఘా చేపడుతున్న ప్రతి పనిని భూతద్దంలో పెట్టి చూస్తున్న రవి ప్రకాష్.. మొత్తానికి యూరో ఎగ్జిమ్ బ్యాంకు ద్వారా బండారాన్ని బయటపెట్టాడు. దీనిని తన ఆర్ టీవీ లో పదేపదే ప్రసారం చేశాడు..”తప్పుడు బ్యాంకు షూరిటీలు ఇచ్చి మెఘా కంపెనీ మోసానికి పాల్పడుతోంది. మా వద్ద కీలకమైన ఆధారాలు ఉన్నాయి. దేశంలో ఎన్నో బ్యాంకులు ఉండగా సెయింట్ లూసియాలోని యూరో మ్యాగ్జిమ్ బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. దీనిపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని” రవి ప్రకాష్ తన కథనంలో పేర్కొన్నాడు. మొత్తంగా మెఘా కంపెనీ చేసిన స్కాం రెండున్నర వేల కోట్ల వరకు ఉంటుందని రేయ్ ప్రకాష్ అంటున్నాడు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అతడు ప్రదర్శించాడు. మరి దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయా? లేదా అనేది చూడాల్సి ఉంది.